మరి కొన్ని నెలల పాటు తననే కెప్టెన్ గా కొనసాగించాలని రోహిత్ శర్మ తాజాగా బీసీసీఐ రివ్యూ మీటింగ్ లో కోరినట్లు తెలిసింది. అలానే కొత్త కెప్టెన్ ను వెతకాలని బీసీసీకి రోహిత్ శర్మ చెప్పినట్లు సమాచారం అందింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను టీమిండియా కోల్పోవడంపై బీసీసీఐ సమీక్ష చేసింది. ఈ భేటీలో అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలోనే భవిష్యత్తు టెస్టు, వన్డే కెప్టెన్ ఎంపికపైనా కూడా తీవ్రంగా చర్చ జరిగినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడని అనుకున్నప్పటికీ, అలాంటిదేమీ లేదని ఇప్పటికే అతడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా మీటింగ్ లో రోహిత్, సారథిగా తానే కొన్ని నెలలు కొనసాగుతానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను రోహిత్ శర్మ నడిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

బుమ్రాకు నో
ఇంకా ఈ సమావేశంలో రోహిత్ శర్మకు వారసుడిగా, లాంగ్ టెర్మ్ కెప్టెన్ గా బుమ్రాకు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ లు వినిపించిన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది మాజీలు మాత్రం బుమ్రాపై అనవసర ఒత్తిడి పెట్టొద్దని వ్యాఖ్యానించారు.అయితే ఇప్పుడీ తాజా రివ్యూ మీటింగ్ లో కొత్త కెప్టెన్ గా బుమ్రా పేరును ప్రతిపాదించారట. కానీ బుమ్రాకు నాయకత్వం అప్పగించేందుకు కొంతమంది విముఖత చూపారట.
ఎందుకంటే బుమ్రా తరచుగా గాయల బారిన పడుతుంటాడు. రీసెంట్ గా కూడా జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో అతడు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టూర్ లో 150కిపైగా ఓవర్లను వేసిన అతడు వెన్ను నొప్పి కారణంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడటంపై అనుమానాలు మొదలయ్యాయి. అందుకే బుమ్రాకు ఫిట్ నెస్ సమస్యలు ఉన్న నేపథ్యంలో అతడికి పూర్తి స్థాయి కెపెన్సీ బాధ్యతలు అప్పగించడం సరైనది కాదని కొంతమంది అభిప్రాయపడ్డారని తెలిసింది