
దేశంలో కరోనా మహమ్మారి క్రికెట్‌పై ప్రభావం చూపించింది. దీంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన అనేక టోర్నీలు వాయిదాపడ్డాయి. ఇందులో ప్రముఖ దేశావాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ కూడా ఉంది. గత నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే టీమిండియా మ్యాచ్‌లు కూడా జరగబోతున్నాయి. దీంతో ఇక రంజీ ట్రోఫీని కూడా ప్రారంభించడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు రంజీ ట్రోఫీ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 38 జట్లు ఈ ట్రోఫీలో పాల్గొంటున్నాయి. ఈ 38 జట్లు 8 గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. ఒక్కో గ్రూపులో నాలుగేసి జట్లు పోటీ పడనున్నాయి. మిగతా 6 జట్లు ప్లేట్ గ్రూప్ నుంచి తలపడనున్నాయి.
ఈ లీగ్‌పోటీలకు వేదికలుగా హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, తిరువనంతపురం, కటక్, చెన్నై, గువాహటి, రాజ్‌కోట్ నగరాలను బీసీసీఐ ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీ ప్రారంభం కాబోతుండడంతో మిగతా టోర్నీలు కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాయిదా పడ్డ టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ వంటి టోర్నీలను తిరిగి ప్రారంభించడానికి నిర్వహకులు సిద్దమవుతున్నారు.
గత నెల ఆరంభంలో రంజీ ట్రోఫీలో కరోనా కలకలం రేగింది. బెంగాల్ జట్టులోని ఆటగాళ్లు భారీగా కరోనా బారిన పడ్డారు. బెంగాల్ జట్టులోనే కాకుండా ముంబై జట్టులోనూ కరోనా కలకలం రేగింది. బెంగాల్ జట్టులోని ఏడుగురికి, ముంబై జట్టులోని ఒకరికి కరోనా సోకింది. బెంగాల్ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లకు, ఒక కోచింగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
కరోనా బారిన పడ్డ బెంగాల్ ఆటగాళ్లలో సురజిత్ యాదవ్, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, గీత్ పూరి, ప్రదీప్త ప్రమాణిక్, కాజీ జునైద్ సైఫీ ఉన్నారు. ఇక మాజీ క్రికెటర్, కోచింగ్ సిబ్బంది అయిన సౌరశిష్ లాహిరికి కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అలాగే ముంబై జట్టు ఆల్‌రౌండర్ శివమ్ దూబెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే వీరందరూ క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకుని రంజీ ట్రోఫీ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు.