హైదరాబాద్: డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మైదానంలో కఠిన సమయాల్లో భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలి? ఇలా దైనందిన జీవితంలో భారత క్రికెటర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బీసీసీఐ పరిష్కారం చూపేందుకు శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా క్రికెటర్ల కోసం తొలిసారిగా ప్రొఫెషనల్ క్రికెటర్ కచ్చితంగా తెలుసుకోవాల్సిన 100 అంశాలు పేరుతో ఓ హ్యాండ్‌బుక్ రూపొందించింది. జస్టిస్ లోధా సిఫారసులకు అనుగుణంగా రూపొందించిన ఈ హ్యాండ్‌బుక్‌ను శుక్రవారం పరిపాలన కమిటీ (సీవోఏ) విడుదల చేసింది.

ఒత్తిడిని జయించడం, గాయాలను అధిగమించడం, మంచి ఆహారం తీసుకోవడం, శరీరంపై అవగాహన, మానసిక భావోద్వేగాలను అదుపు చేసుకోవడం, వాణిజ్య, న్యాయపరమైన అంశాలపై అవగాహన, మీడియాతో వ్యవహరించడం, ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగడం ఇలా 10 విభాగాలను ఇందులో పొందుపర్చారు.
భారత-ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. 'క్రికెట్‌లో ముందుకెళ్లాలంటే యువ క్రికెటర్లకు సరైన మద్దతు, ప్రోత్సాహం చాలా అవసరం. అందుకే వాళ్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని భావించా' అని ద్రవిడ్ పేర్కొన్నారు.
'నేను ఆడే రోజుల్లో నా అదృష్టంకొద్ది చాలా మంది మెంటార్స్ లభించారు. నా ఎదుగుదలలో చాలా రకాలుగా సాయం చేశారు. ఈ బుక్ చాలా విలువైంది. సమయానుకూలంగా దీన్ని అందరూ చదువాలి. చాలా విషయాలను ఇందులో పొందుపర్చారు. దీని ఆధారంగా యువ క్రికెటర్లు సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉంది' అని అన్నారు.