న్యూఢిల్లీ: బీసీసీఐ ప్రక్షాళన కోసం లోధా కమిటీ సూచించిన కీలక సంస్కరణల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ బోర్డులో మంత్రులు సభ్యులుగా ఉండకూడదని స్పష్టం చేసింది. బోర్టులో సభ్యుల వయసు 70 ఏళ్లకు మించవద్దన్న నిబంధనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో పాటు ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అన్న నిబంధనను కూడా అమలు చేయాలని ఆదేశించింది. లోధా కమిటీ సూచించిన సంస్కరణలను బీసీసీఐ అమల్లోకి తెచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం బోర్డుకి ఆరు నెలల వ్యవధి ఇచ్చింది. బోర్డు ఖచ్చితంగా మార్పును అంగీకరించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు.
ఈ తీర్పు బీసీసీఐలో భారీ సంస్కరణలకు తావిస్తుందని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీసీసీఐలో ఈ మార్పులను లోధా కమిటీ ఎప్పటికప్పడు పరిశీలిస్తుందని కూడా ఆయన తీర్పులో పేర్కొన్నారు. బోర్డు గవర్నింగ్ కౌన్సిల్‌లో కాగ్ సభ్యుడికి స్థానం కల్పించాలన్న లోధా కమిటీ సిఫారసును కూడా సుప్రీం కోర్టు అంగీకరించింది.

బోర్డుకు మూడు కొత్త స్థానాలను కల్పించాలని కోర్టు ఆదేశించింది. అందులో ఒకటి అంబుడ్సమన్ కాగా రెండోది ఎథిక్స్ ఆఫీసర్, మూడోది ఎలక్ట్రోల్ ఆఫీసర్. ఇక బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలా వద్దా అన్న అంశాన్ని పార్లమెంట్‌కు వదిలేసింది. దేశంలో బెట్టింగ్ చట్టబద్ధం చేసే అంశాన్ని కూడా పార్లమెంట్‌కే వదిలేసింది.
దేశంలో బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలన్న కమిటీ సిఫారసును కూడా కోర్టు పార్లమెంట్‌కే వదిలేసింది. బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) ప్రక్షాళనకు కూడా లోధా కమిటీ సూచించిందిన సంగతి తెలిసిందే. గవర్నింగ్ కౌన్సిల్ లో కాగ్ సూచించిన వ్యక్తికి కూడా చోటు కల్పించాలన్న దానికి కోర్టు ఓకే తెలిపింది.
ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పు అనంతరం జస్టిస్ లోధా మాట్లాడుతూ ఇది భారత క్రికెట్‌కు గొప్ప రోజని, సంస్కరణలను సాధ్యమైనంత తొందరగా అమలుచేయాలని అన్నారు. మరోవైపు సుప్రీం తీర్పుపై స్పందించడానికి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. తీర్పు ప్రతిని పూర్తిగా చదివిన తర్వాతే దీనిపై స్పందిస్తానని స్పష్టంచేశారు.
కోర్టు తీర్పుని గౌరవిస్తాం: రాజీవ్ శుక్లా
బీసీసీఐలో సంస్కరణలపై సుప్రీంకోర్టు చేసిన తీర్పును తాము గౌరవిస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్‌శుక్లా అన్నారు. లోధా కమిటీ సిఫారసులను ఎలా అమలుచేయాలన్న దానిపై దృష్టిసారిస్తామని అన్నారు. లోధా కమిటీ సిఫారసుల్లో ఒక రాష్ట్రానికి ఒకే ఓటు, ఆఫీస్ బేరర్స్‌లో 70 ఏళ్ల వయసు మించిన వాళ్లు ఉండకూడదన్న నిబంధనలను గతంలో బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
అయితే మార్పులకు బోర్డు సభ్యులు ఖచ్చితంగా అమలు చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని ఏ విధంగా అమలు చేస్తుందన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.