India vs Sri Lanka: అతడే శ్రీలంక పర్యటనకు కోచ్.. స్పష్టం చేసిన బీసీసీఐ చీఫ్!!

ముంబై: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా శ్రీలంక పర్యటనలో యువ ఆటగాళ్లకు బీసీసీఐ చోటు కల్పించింది. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీష్ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు.

క్వారంటైన్‌లో ధావన్ సేన:
శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నిజానికి ఈ పరిమిత ఓవర్ల సిరీసు గతంలో ఆడాల్సింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రత్యామ్నాయ ఆటగాళ్లు, టీ20 స్టార్లు అందుబాటులో ఉండటంతో.. ఆ పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ఖరారు చేసింది. సోమవారం రాత్రి ముంబైకి చేరుకున్న ధావన్ సేన అక్కడ హోటల్‌లో 14 రోజుల క్వారంటైన్‌లో ఉండనుంది. అనంతరం ఛార్టర్ ప్లైట్‌లో లంకకి వెళ్తుంది. అక్కడికి చేరుకున్నాక శిక్షణకు ముందు మళ్లీ మూడు రోజుల పాటు.. జులై 4 వరకు హార్డ్ క్వారంటైన్‌లో ఉంటారు. అనంతరం జులై 12వరకు బయోబబుల్‌లో ట్రైనింగ్ అవుతారు. ఆపై ఇంట్రా స్క్వాడ్ గేమ్స్ ఆడతారు.

కోచ్‌గా ద్రవిడ్:
శ్రీలంక పర్యటనలో భారత్‌కు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉంటారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బీసీసీఐ వర్గాలూ ఇదే విషయం స్పష్టం చేశాయి. తాజాగా బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిని ధ్రువీకరించారు. 'శ్రీలంక టూర్‌కి వెళ్లబోయే భారత జట్టుకి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉంటారు' అని గంగూలీ తాజాగా ప్రకటించారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్‌ని శ్రీలంక టూర్‌కి కోచ్‌గా ఉండమని బీసీసీఐ ఇటీవల రిక్వెస్ట్ చేయగా.. అందుకు ద్రవిడ్ అంగీకరించారు. గతంలో అండర్-19, భారత్-ఏకు కోచ్‌గా మిస్టర్ డిపెండబుల్‌కు ఎంతో అనుభవం ఉంది. ఆటగాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉంది. లంక పర్యటనకూ అప్పటి ఆటగాళ్లే ఎంపికవ్వడంతో ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించినట్టు తెలిసింది.

ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు:
పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభానికి ముందు 'లంక ఏ' జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆడటానికి శ్రీలంక క్రికెట్ బోర్డు అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మన ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయి ఓ టీ20, రెండు వన్డేల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఇరు జట్లు మూడు వన్డేలు (జులై 13, 16, 18), మూడు టీ20లు (21, 23, 25)వ తేదీల్లో ఆడనున్నాయి. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లూ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్నాయి. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2.30 గంటలకి ప్రారంభంకానుండగా.. టీ20లు రాత్రి 7 గంటలకి స్టార్ట్ అవుతాయి.

భారత జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications