ముంబై: సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలు జస్టిస్ లోధా కమిటీ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు. లోధా కమిటీ సూచించిన సంస్కరణల్లో కొన్నింటిని అమలు చేసేందుకు బోర్డు సభ్యులు ఒప్పుకోవడం లేదని ఏడు పేజీల అఫిడవిట్‌లో ఠాకూర్ పేర్కొన్నాడు.
దీనికి సంబంధించిన 50 పేజీల సపోర్టింగ్ డాక్యుమెంట్లను కూడా అఫిడవిట్‌కు అనుసంధానంగా కోర్టులో సమర్పించారు. సంస్కరణలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన బోర్డు సమావేశం మినిట్స్‌ను కూడా లోధా కమిటీకి అందజేశాడు. ఈ నేపథ్యంలో ఎలా వ్యవహరించాలో ఆదేశాలు ఇవ్వాలని నివేదికలో లోధా కమిటికి విజ్ఞప్తి చేశాడు.

ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆగస్టు 9న వ్యక్తిగతంగా కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయానని ఠాకూర్ అందులో పేర్కొన్నాడు. మరోవైపు రాబోయే రెండు రోజుల్లో లోధా కమిటీని కలిసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నట్లు బోర్డు అధికారి ఒకరు తెలియజేశారు.
ఈ మేరకు లోధా కమిటీకి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలు లేఖ రాశారు. 'ఈనెల 9వ తేదీ తర్వాత లోధా కమిటీని అనురాగ్, షిర్కేలు కలుస్తారు. లోధా కమిటీ సూచించిన సిఫారుసుల అమలుకు సంబంధించి బీసీసీఐ ప్రణాళికను ఆ కమిటీ ముందు ఉంచుతుంది' అని తెలిపారు.