ఐపీఎల్‌ను ఈ ఏడాది ఇండియాలో చూడడం కష్టంగానే ఉంది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులే ఇందుకు కారణం. గురువారం ఏకంగా దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మొదట ముంబైలోనే అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ అక్కడ కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో విదేశాలకు తరలించే ఆలోచనలో ఉంది. ఒక వేళ విదేశాలకు తరలించాల్సి వస్తే గతేడాది మాదిరిగా ఈ సారి కూడా యూఏఈలోనే నిర్వహించాలని భావించింది.
కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా లేదా శ్రీలంకలో ఐపీఎల్ 2022ని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు దక్షిణాఫ్రకా, శ్రీలంకను బీసీసీఐ బ్యాకప్‌లుగా పెట్టుకుందట. 2009లో దేశంలో ఎన్నికలు ఉండడంతో బీసీసీఐ ఆ సీజన్ మొత్తం ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలోనే నిర్వహించింది. అయితే శ్రీలంక ఇప్పటివరకు ఒక్క సారి కూడా ఐపీఎల్‌ను నిర్వహించలేదు. యూఏఈ విషయానికొస్తే 2020 ఐపీఎల్ సీజన్ మొత్తం యూఏఈలోనే జరిగింది. 2021లో సెకండ్ ఎడిషన్ కూడా యూఏఈలోనే జరిగింది.
తాము ప్రతిసారి యూఏఈపైనే ఆధారపడాలని అనుకోవడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరిన్ని వేదికల కోసం వెతుకుతున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే సౌతాఫ్రికాతోపాటు శ్రీలంకను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సౌతాఫ్రికా కూడా ఆటగాళ్లకు సురక్షితమైనదిగా భావిస్తున్నామని తెలిపారు. నిజానికి సౌతాఫ్రికాలో ప్రస్తుతం కరోనా మహమ్మారితో పాటు ఒమిక్రాన్ కూడా విజృంభిస్తోంది. అయినప్పటికీ కరోనా టైమ్‌లోనే అక్కడ రెండు ప్రధాన సిరీస్‌లను విజయవంతంగా నిర్వహించారు. భారత్ ఏ, సౌతాఫ్రికా ఏ మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌లు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయి. దీనికి తోడు ప్రస్తుతం సీనియర్ల జట్ల టెస్టు సిరీస్ కూడా సాఫీగా సాగుతుంది.
ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టు జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ కోసం బస చేసిన హోటల్ చాలా సువిశాలమైనదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అక్కడ వాకింగ్ ట్రాక్, సరస్సులు ఉన్నాయని చెప్పారు. అక్కడ ఉంటే ఆటగాళ్లకు బయోబబుల్‌లో ఉన్నామనే ఫీలింగ్ కూడా ఉండదని, అక్కడి ఉల్లాసవంతమై వాతావరణం వాటన్నింటిని మరిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఐపీఎల్ వేదికపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే.