
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రౌండ్ కూడా మొదలైపోయింది. టైటిల్ రేసులో కొన్ని ప్రధాన జట్లు వెనకపడ్డాయి. హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా బోణీనే కొట్టలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌దీ అదే పరిస్థితి. ఈ మూడు జట్లూ గెలుపు కోసం ముఖం వాచిపోయాయి. పాయింట్ల పట్టికలో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇవ్వాళ్టి మ్యాచ్ జరుగనుంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లేవీ ముంబై, పుణేలను దాటట్లేదు. ఈ రెండు నగరాలకే పరిమితం అయ్యాయి. ముంబైలోని వాంఖెడె, బ్రబౌర్న్, పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాల్లో లీగ్ దశ మ్యాచ్‌లనింటినీ నిర్వహించనుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
తాజాగా- కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటోంది బీసీసీఐ. దీని ప్రకారం చూస్తే- ఫైనల్ మ్యాచ్ మహారాష్ట్రను దాటే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఐపీఎల్ సీజన్ ఫైనల్స్‌ను నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. రెండో ఎలిమినేట్ మ్యాచ్ కూడా అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌ను లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియానికి షిఫ్ట్ చేయాలని భావిస్తోంది.

ఈ సంవత్సరం కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లో చేరినందు వల్ల బీసీసీఐ ఈ దిశగా ప్రణాళికలను రూపొందించుకుంటోందని, ఆయా జట్లను మరింత ప్రోత్సహించినట్టవుతుందని భావిస్తోంది. గతంలో ఎప్పుడూ లక్నోలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించిన సందర్భాలు లేవు. లక్నో సూపర్ జెయింట్స్ చేరికతో ఆ కొరత తీర్చినట్టవుతుందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి.
లీగ్ దశ ముగిసిన అనంతరం మిగిలిన వాటిని లక్నో, అహ్మదాబాద్‌కు తరలించే ప్రతిపాదనలను పరిశీలిస్తోందని, సానుకూల నిర్ణయం తీసుకోవడానికే అవకాశాలు ఉన్నాయని సమాచారం. లక్నోలో తొలి ఎలిమినేటర్‌ను నిర్వహించడం వల్ల హోమ్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌ను మరింత ప్రోత్సహించినట్టవుతుందనేది బీసీసీఐ అభిప్రాయంగా తెలుస్తోంది. దీనిపై తుదినిర్ణయాన్ని తీసుకోవాల్సింది ఉందని బీసీసీఐ అధికార వర్గాలు చెబుతున్నాయి.