బీసీసీఐ మరో కొత్త లీగ్‌ను నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2008లో బీసీసీఐ ఐపీఎల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. టీ20 ఫార్మాట్‌కు విపరీతంగా క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఐపీఎల్‌తోనే ఎంతో మంది క్రికెటర్లు టీమిండియా తలుపుతట్టారు.
అయితే ఐపీఎల్ తరహాలోనే టీ10 లీగ్‌ను ప్రారంభించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై బీసీసీఐ సెక్రటరీ జై షా బ్లూ ప్రింట్ సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో ఈ లీగ్‌ను నిర్వహించాలని షెడ్యూల్ కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

భారత్‌లో టీ10 లీగ్ నిర్వహించడంపై బీసీసీఐ కొన్ని అంశాలపై ప్రత్యేకంగా చర్చిస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకే టీ10 లీగ్‌ను అప్పగించాలా? భారత్‌లోనే టీ10 లీగ్‌ను నిర్వహించాలా లేదా ప్రతి ఏటా వేదికను మార్చాలా? టీ10 లీగ్ ఆడే ఆటగాళ్లకు వయసు పరిమితి విధించాలా? అనే అంశాలపై పెద్దఎత్తున చర్చిస్తున్నారు.
మరోవైపు టీ10 లీగ్ నిర్వహించాలనే బీసీసీఐ ఆలోచనలపై విమర్శలు వస్తున్నాయి. టీ20 ఎఫెక్ట్‌తోనే వన్డే, టెస్టు ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతుందని, ఇప్పుడు టీ10 లీగ్ అంటే క్రికెట్‌లో అనూహ్య మార్పులు వస్తాయని, ప్రపంచ క్రికెట్‌కే ఇది మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్‌లో ప్రస్తుతం పాకిస్థాన్ ఆటగాళ్లు మినహా ప్రపంచ స్టార్ ప్లేయర్లు అందరూ పాల్గొంటున్నారు. భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఐపీఎల్‌కు ప్రపంచంలో ఏ లీగ్‌కు దక్కని ఆదాయం, విపరీతమైన క్రేజ్ దక్కుతోంది.