టీమిండియా టెస్టు జట్టు ఆటగాళ్లు, ఆశావాహులు అందరినీ బీసీసీఐ అలర్ట్ చేసింది. వచ్చే నెలలో జరగనున్న దులీప్ ట్రోఫీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదేశించింది. అయితే ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చిందని సమాచారం. దేశవాళీ క్రికెట్‌లో దులీప్ ట్రోఫీకి ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. భౌగోళిక ఆధారంగా జోన్ల మధ్య ఈ టోర్నమెంట్ జరుగుతుంది. నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్‌తో పాటు నార్త్‌ఈస్ట్ జోన్ జట్లు పాల్గొంటాయి.
అయితే దులీప్ ట్రోఫీకి సాధారణంగా జోనల్ సెలక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేస్తుంది. కానీ ఈ సారి మాత్రం జాతీయ సెలక్షన్ కమిటీనే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి భారత జట్టు సుదీర్ఘంగా టెస్టు ఫార్మాట్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో ఉండే ఆటగాళ్లందరూ దులీప్ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన గౌతమ్ గంభీర్ ఉన్నాడని తెలుస్తోంది.

రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. జులై 27వ తేదీ నుంచి మొదలుకానున్న లంక పర్యటనతో గంభీర్ తన యాక్షన్ మొదలుపెట్టనున్నాడు. అయితే శ్రీలంక పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది.దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవాళీ క్రికెట్‌లో భారత ప్లేయర్లు పాల్గొనేలా గంభీర్ చేస్తున్నాడు. కాగా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
''ఈ సారి దులీప్ ట్రోఫీకి జోనల్ సెలక్షన్ కమిటీ లేదు. జట్లను జాతీయ సెలక్షన్ కమిటీనే ఎంపిక చేస్తుంది.టెస్టు జట్టు పోటీదారులందరినీ ఎంపిక చేస్తారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా ఆడాలా? వద్దా అనేది వారి నిర్ణయానికే వదిలేశాం'' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.