
హైదరాబాద్: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ వేదికగా ఆసియా ఎమర్జింగ్ నేషన్స్ కప్ టోర్నీని నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లో ఈ టోర్నీ జరిగితే భారత్ తరఫున ఆడే జట్టు అందులో పాల్గొనదని బీసీసీఐ తేల్చి చెప్పింది.
2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌లో ఒక్క అంతర్జాతీయ స్థాయి టోర్నీనైనా నిర్వహించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు విశ్వప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది వరల్డ్ ఎలెవన్ జట్టుతో లాహోర్ వేదికగా టీ20 సిరిస్‌ను ఆడించిన సంగతి తెలిసిందే.
మొన్నటికి మొన్న శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య ఒక టీ20 మ్యాచ్ ఆడించి అక్కడి అభిమానుల మన్ననలు పొందింది. అయితే తాజాగా ఆసియా ఎమర్జింగ్ నేషన్స్ కప్ టోర్నీని తమ దేశంలో నిర్వహించాలని ఐసీసీపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో అక్టోబర్ 29న లాహోర్‌లో జరిగిన ఏసీసీ సమావేశంలో పాకిస్థాన్‌లో ఈ టోర్నీ నిర్వహించాలని తీర్మానించారు.
ఆరు దేశాలు పాల్గొనే ఈ టోర్నీని ఎలాగైన సరే విజయవంతం చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చూస్తుంటే బీసీసీఐ అభ్యంతరం తెలిపింది. గతంలో జరిగిన సమావేశానికి సైతం బీసీసీఐ హాజరుకాలేదు. తమని సంప్రదించకుండా పాకిస్థాన్‌లో ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారని బీసీసీఐ పేర్కొంది.
ఇటీవలే దుబాయ్‌లో జరిగిన మరో సమావేశంలో కూడా ఈ విషయాన్ని చెప్పామని అయినా... వేదిక విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం రాలేదని బీసీసీఐ తెలిపింది. ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరిగితే భారత్ తరఫున ఏ జట్టు కూడా అందులో పాల్గొనదని, అప్పుడు ఏసీసీ ఈ టోర్నీ ఎలా నిర్వహిస్తుందో చూస్తామని బీసీసీఐ పేర్కొనడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.