టీమిండియా కొత్త కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతానే ఉంది. ఈ పదవికి బీసీసీఐ దరఖాస్తుల కోరినప్పటి నుంచి రోజుకో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు అందుకుంటాడని తొలుత ప్రచారం జోరుగా సాగింది. కానీ భారత సీనియర్ జట్టు బృందానికి గురువు బాధ్యతలు అందుకోవడానికి లక్ష్మణ్ ఆసక్తి చూపించట్లేదని తర్వాత తేలింది.
ఆ తర్వాత విదేశీ క్రికెటర్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్‌లలో ఒకరిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఉందని వార్తలు వచ్చాయి. బీసీసీఐ వర్గాలు తనని సంప్రదించాయని పాంటింగ్ కూడా స్వయంగా చెప్పాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సలహాతో భారత కోచ్ పదవికి దూరంగా ఉండాలనుకుంటున్నాని లాంగర్ వివరించాడు. అయితే బీసీసీఐ కార్యదర్శి జైషా మాత్రం భిన్నంగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వారిద్దరినీ బీసీసీఐ కాంటాక్ట్ చేయలేదని అన్నాడు.

అంతేగాక దేశవాళీ క్రికెట్ పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తినే కోచ్‌గా నియమిస్తామని జై షా తెలియజేయడంతో, భారత మాజీ క్రికెటరే టీమిండియా కొత్త కోచ్ అని స్ఫష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పేరు గట్టిగా వినిపించింది. ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్ పేర్లు కూడా వినిపించినప్పటీకీ గంభీర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగింది. గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టి కేకేఆర్‌ను విజేతగా నిలపడంతో అతని ఎంపిక ఖరారైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
మరోవైపు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం గౌతమ్ గంభీర్‌తో జై షా ప్రత్యేకంగా చర్చించడం వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే టీమిండియా కోచ్ రేసులో తాజాగా కొత్త ట్విస్ట్ ఎదురైంది. కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేసినట్లుగా స్పష్టత లేదని జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. అందుకే ఎంపిక విధానాన్ని బీసీసీఐ ఆలస్యం చేస్తుందని పేర్కొంది. అంతేగాక భారత కోచ్‌గా చేయాలా వద్దా అనే సందిగ్ధతలో గంభీర్ ఉన్నాడని, అతని నిర్ణయం కోసం బీసీసీఐ ఎదురుచూస్తుందని తెలిపింది.
కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్‌కు గంభీర్ అత్యంత సన్నిహితుడు. టీమిండియా కోచ్ పదవి చేపడితే గంభీర్ కేకేఆర్‌కు 2027 వరకు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. దీంతో గంభీర్ ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోచ్ ఎంపిక ప్రక్రియపై దృష్టిసారించాలని బీసీసీఐ ఆలోచిస్తోందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రపంచకప్ తర్వాత శ్రీలంక, జింబాబ్వేతో టీమిండియా సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లకు సహాయక బృందంతో కూడా మ్యానేజ్ చేయవచ్చని, అందుకే కోచ్ విషయంలో తొందరేమి లేదని పేర్కొన్నారు.