భారత్ ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్‌కు రోజుకో కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను జూన్ 27న బీసీసీఐ, ఐసీసీ ప్రకటించాయి. అంతా బాగానే ఉందని ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలయ్యాడు. తాము చూడాలనుకునే మ్యాచుల కోసం టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకున్నారు.
ఇలాంటి సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించాల్సిన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ)కు ఊహించని అడ్డంకి వచ్చిపడింది. నవరాత్రి ఉత్సవాల కారణంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర పోలీసు శాఖ చెప్పేసింది. ఇదే విషయాన్ని బీసీసీఐకి జీసీఏ తెలియజేసింది.

కానీ అప్పటికే షెడ్యూల్ ప్రకటించి నెలరోజులు గడిచిపోయింది. జులై 26న జీసీఏ ఈ అభ్యర్థన చేసింది. ఆ తర్వాత మరో పది రోజులు ఆగిన తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇలాంటి అభ్యర్థనే చేసింది. కాళీ పూజ కారణంగా షెడ్యూల్ మార్చాలని బీసీసీఐని కోరింది. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రెస్ మీటింగ్ పెట్టాడు.
మూడు సభ్య బోర్డుల అభ్యర్థన మేరకు వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయని తెలిపాడు. అనంతరం ఈ నెల 9వ తేదీన అప్‌డేటెడ్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఇక అంతా సర్దుకుందని అనుకుంటున్న సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మరో అడ్డుపుల్ల వేసింది.
వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9వ తేదీన న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఆ మరుసటి రోజు అంటే 10వ తేదీన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ ఉంది. ఇలా వరుస దినాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం తమ వల్ల కాదని, భద్రతా కారణాల దృష్ట్యా ఈ షెడ్యూల్‌ను మార్చాలని తాజాగా హెచ్‌సీఏ కోరిందట.
ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్‌కు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. షెడ్యూల్ డిసైడ్ చేసే సమయంలో అసోసియేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు శాఖ అభిప్రాయాలను బీసీసీఐ తీసుకోలేదా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంత చెత్తగా వరల్డ్ కప్ మేనేజ్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.