హైదరాబాద్: దేశవాళీ క్రికెటర్లు, మ్యాచ్ అధికారుల జీతాలు పెంపు గురించి పరిశీలిస్తున్న బీసీసీఐ ముందుకు మరో ప్రతిపాదన వచ్చింది. జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీకి చెందిన సీనియర్, జూనియర్ సెలక్టర్లు తమ వేతనాలను పెంచాల్సిందిగా బీసీసీఐని కోరారు.
దేశవాళీ క్రికెటర్లతో పాటు మ్యాచ్ అధికారుల వేతనాలను పెంచే ప్రయత్నంలో ఉన్నామని ఇటీవల బోర్డు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో సెలక్టర్లు తమ గురించి కూడా ఆలోచించాలని బోర్డుకి విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదేళ్లుగా ఎలాంటి మార్పులేని తమ జీతాలను ఈసారైనా పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి సీజన్‌కు రూ.60 లక్షలు బీసీసీఐ చెల్లిస్తోంది. అదే జూనియర్ ప్యానెల్ సభ్యులు ఏడాదికి రూ.40 లక్షల వేతనం పొందుతున్నారు. ఇక సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌కూ మిగతా సభ్యులతో సమానంగా వేతనం లభిస్తోంది.
2012 నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. సెలెక్టర్ల పారితోషికం పెంచాలని తమకు ఇదివరకే చాలా విజ్ఞప్తులు వచ్చాయని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సీనియర్ సెలక్షన్ ప్యానెల్ ఛైర్మన్‌కు రూ. 1.2 కోట్ల జీతం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందని తెలిపారు. బీసీసీఐ కూడా 30-35 శాతం పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.