హైదరాబాద్: టీమిండియా పేసర్ శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో బీసీసీఐ పిటిషన్ దాఖలు చేసింది. శ్రీశాంత్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాల కారణంగానే తాము నిషేధం విధించామని, ఆ శిక్షను కొనసాగనివ్వాలని బోర్డు తన పిటిషన్‌లో పేర్కొంది.
2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీశాంత్‌పై బోర్డు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఆగస్టు 7న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై శ్రీశాంత్ అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నేను అడుక్కోవడం లేదు. నా జీవనోపాధి నాకు తిరిగివ్వమని అడుగుతున్నా. మీరు(బీసీసీఐ) దేవుడు కంటే ఎక్కువ కాదు. మళ్లీ కచ్చితంగా ఆడతాను. ఒకసారి కాదు చాలా సార్లు నిరపరాధినని నిరూపించుకున్నా. అయినా బీసీసీఐ నీచంగా వ్యవహరిస్తోంది. ఎందుకో అర్థం కావడం లేదు' అని ట్విట్టర్లో శ్రీశాంత్ అన్నాడు.
క్రికెట్‌లో ఏమాత్రం అవినీతి, స్పాట్ ఫిక్సింగ్‌ని సహింబోమని బోర్డు చెబుతోందని మరి చెన్నై, రాజస్థాన్‌ల పరిస్థితి ఏంటని శ్రీశాంత్ ప్రశ్నించాడు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో శ్రీశాంత్‌ను మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టనీయకూడదని బీసీసీఐ భావిస్తోంది.