ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా వేదికలు కూడా ఖరారవడంతో.. ఆయా స్టేడియాల్లో అన్ని సదుపాయాలు సరిగా ఉన్నాయో లేదో కూడా పరీక్షిస్తోంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని కొత్త రకంగా ఆవిష్కరించింది. ఈ ట్రోఫీని అంతరిక్షం అంచుల్లో లాంచ్ చేసి ఔరా అనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని స్ట్రాటోస్ఫేరిక్ బలూన్ సాయంతో ఆకాశంలోకి పంపింది బీసీసీఐ. నేల మీది నుంచి ఏకంగా లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ట్రోఫీని ఆవిష్కరించింది. అనంతరం అక్కడి నుంచి నేల మీదకు తీసుకొచ్చింది. స్ట్రాటో ఆవరణం నుంచి నేరుగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ట్రోఫీ ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.

ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇలా వరల్డ్ కప్ ట్రోఫీని అనూహ్యంగా లాంచ్ చేయడం వారికి కూడా పెద్ద షాకే ఇచ్చినట్లు కనిపిస్తోంది. కాగా, ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీని కోసం ఇప్పటికే వేదికలను కూడా బీసీసీఐ గుర్తించింది. డ్రాఫ్ట్ షెడ్యూల్ రెడీ చేసి ఐసీసీకి పంపేసింది కూడా. దీనిపై సభ్య దేశాల అభిప్రాయాలను ఐసీసీ కోరింది.
ఈ క్రమంలోనే తాము ఆడే రెండు మ్యాచుల వేదికలు మార్చాలని పీసీబీ కోరింది. స్పిన్ బలం ఎక్కువగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో చెపాక్‌లో మ్యాచ్ ఆడాల్సిన పాక్.. ఈ వేదికను బెంగళూరులోని చిన్నస్వామికి మార్చాలని కోరింది. అయితే సరైన కారణం లేకుండా ఇలా మార్చడం కుదరదని ఐసీసీ తేల్చిచెప్పేసింది. దీంతో పీసీబీ ఏం చేయలేని స్థితిలో పడింది. మిగతా దేశాలు ఎలాంటి అభ్యంతరాలు వెల్లడించలేదని సమాచారం. త్వరలోనే ఈ షెడ్యూల్‌కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.