ప్రపంచ క్రికెట్ పండుగ వన్డే వరల్డ్ కప్‌కు మూడు నెలల సమయం కూడా లేదు. దీంతో అటు ఫ్యాన్స్‌లో, ఇటు టీమ్స్‌లో ఈ మెగా టోర్నీ హీట్ పెరిగిపోతోంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొత్తం ఐదు మ్యాచులు జరగనున్నాయి. నవంబరు 5న భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కూడా అందులో ఒకటి. అంతేకాదు, రెండో సెమీఫైనల్ నిర్వహించే అవకాశం కూడా ఈ స్టేడియం దక్కించుకుంది.
ఈ క్రమంలోనే ఇటీవల ఆ ఐదు మ్యాచులకు సంబంధించిన టికెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రకటించింది. క్యాబ్ చీఫ్ స్నేహాశిష్ గంగూలీ ఈ ధరలను ప్రకటించాడు. వీటిని చూస్తే భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్, సెమీఫైనల్ మ్యాచ్ సమయంలో టికెట్ ధరలను కొంచెం పెంచుకున్నట్లు అర్థం అవుతుంది. ప్రేక్షకుల్లో హైప్ ఉన్న మ్యాచులకు ఇలా ధరలు పెంచడం మామూలు. అందుకే దీన్ని ఫ్యాన్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు.

ఇలాంటి సమయంలో క్యాబ్ నిర్ణయంపై బీసీసీఐ అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాటోర్నీ ప్రారంభానికి ముందే ఇలా టికెట్ల ధరలు ఎలా ప్రకటించేస్తారని బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. అంతేకాదు, టికెట్ల ధరలు ప్రకటిస్తున్నామనే విషయాన్ని తమకు కనీసం చెప్పలేదని, అలా ఇన్ఫామ్ చేయకుండా సొంత నిర్ణయాలు తీసుసుకోవడం ఏంటని బీసీసీఐ పెద్దలకు గుస్సా వచ్చిందట.
అయితే ఈ గొడవ మరీ పెద్దది కాకుండా చూసుకోవాలని క్యాబ్, బీసీసీఐ ప్రతినిధులు అనుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఈడెన్ గార్డెన్స్‌లో రినొవేషన్ పనులు ఎలా జరుగుతున్నాయో చూసేందుకు బీసీసీఐ, క్యాబ్ రెండింటికీ గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ లెజెండ్ సౌరవ్ గంగూలీ వచ్చాడు. ఈ సందర్భంగా టికెట్ల ధరల గొడవ గురించి మాట్లాడుతూ.. 'ఇది పూర్తిగా క్యాబ్‌కు సంబంధించిన అంశం. వాళ్లే చూసుకుంటారు' అని స్పష్టం చేశాడు.