
ముంబై: భారత క్రికెట్ జట్టుకు కొత్త కిట్ స్పాన్సర్‌ను వెతికే పనిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పడింది. ప్రస్తుతం ఆటగాళ్ల దుస్తుల స్పాన్సర్‌షిప్ హక్కులు కలిగి ఉన్న నైకీతో వచ్చే నెలలో ఒప్పందం ముగియనుంది. నాలుగేళ్లకు గాను బీసీసీఐతో నైకీ రూ.370 కోట్ల ఒప్పందం గతంలో కుదుర్చుకుంది. అది పూర్తవుతుండడంతో టెండర్ల ప్రక్రియ ద్వారా కొత్త భాగస్వామిని ఎంచుకునేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
భారత కిట్ స్పాన్సర్ కోసం ఆగస్టు 26 వరకు సంస్థలు బిడ్లు వేసేందుకు వీలుంది. విజేతగా నిలిచే బిడ్డర్ టీమిండియా ప్రధాన జట్టుతో పాటు ఇతర అనుబంధ (మహిళా, యువ) జట్లకు కూడా కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. భారత క్రికెట్ కు సంబంధించి జెర్సీలు, క్యాప్‌లు తదితర అపెరాల్స్‌ను అధికారికంగా అమ్ముకునే హక్కులు వారికి లభిస్తాయి. గత నాలుగేళ్ల కాలానికి నైకీ రూ. 30 కోట్ల రాయల్టీ సహా రూ. 370 కోట్లు బోర్డుకు చెల్లించింది.
ఈ బిడ్‌లో నైకీ కూడా మళ్లీ పాల్గొనేందుకు అర్హత ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అది సందేహమే. ప్రఖ్యాత స్పోర్ట్ అడ్వర్టైజింగ్ కంపెనీ నైకీకి భారత క్రికెట్‌తో 14 ఏళ్ల అనుబంధం ఉంది. తొలిసారి 2006 జనవరి 1న బీసీసీఐతో జత కట్టింది. ఆ రోజుల్లో అడిడాస్, రీబాక్‌లతో పోటీ పడి ఐదేళ్ల కాలానికి 43 మిలియన్ డాలర్లు (అప్పట్లో) చెల్లించి అపెరాల్ హక్కులు సొంతం చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కష్టకాలం నేపథ్యంలో స్పాన్సర్‌షిప్ మొత్తాన్ని కాస్త తగ్గించి తమనే కొనసాగించాలని నైకీ కోరగా.. బీసీసీఐ అందుకు అంగీకరించలేదని సమాచారం తెలుస్తోంది. ఇక వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది పలు సిరీస్‌లు రద్దయిన విషయాన్ని కూడా నైకీ గుర్తు చేసినా లాభం లేకపోయింది. ఒక వేళ ఇప్పుడు కూడా నైకీ బిడ్‌లో పాల్గొన్నా తాము అనుకున్న తక్కువ మొత్తానికే కోట్ చేస్తే... ఇతర కంపెనీలు దానిని వెనక్కి తోసి అవకాశం దక్కించుకోవచ్చు.
కరోనా వైరస్ దాటికి విశ్వవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అన్ని రకాల క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నైకీ కరోనా వైరస్‌కు బయపడేది లేదంటూ తాజాగా తన ట్విటర్ ద్వారా మంచి సందేశం ఇచ్చింది. దాదాపు 1.39 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో అన్ని రకాల క్రీడలతో పాటు 36 మంది పాతతరం, కొత్తతరం ఆటగాళ్లను కలిపి చూపించింది. వీడియోలో రఫెల్ నాదల్, నోవాక్ జొకొవిచ్, టీమిండియా క్రికెట్ మహిళల జట్టు, క్రిస్టియానో రొనాల్డొ, సెరెనా విలియమ్స్, లెబ్రన్ జేమ్స్, కొలిన్ కెపెర్‌నిక్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వీడియోకి యూ కాంట్ స్టాప్ స్పోర్ట్.. యూ కాంట్ స్టాప్ అస్ అంటూ క్యాప్షన్ జత చేశారు.