కొత్త కోచ్‌లకు బీసీసీఐ ఆహ్వానం: రవిశాస్త్రికి డోర్స్ ఓపెన్ చేశారా?
హైదరాబాద్: టీమిండియా కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ కోసం బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించనుంది. కొత్త కోచ్ పదవి ఎంపికపై బోర్డు ఇంకా ఏం తేల్చుకోని నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఇంకో రెండు వారాల పాటు పదవిలో కొనసాగాలని, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాలని బోర్డు కుంబ్లేను కోరింది.
అయితే వెస్టిండిస్ పర్యటనకు కోచ్‌గా రెండువారాల పొడిగింపు కుంబ్లేకు ఇచ్చినా.. దానిని ఆయన తిరస్కరించి మంగళవారం రాజీనామా చేశాడు. కుంబ్లే రాజీనామాతో ప్రధాన కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ ముందు మరిన్ని అప్లికేషన్స్ ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్తగా దరఖాస్తులకు ఆహ్వానం
కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 7-10 రోజులు అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సరైన అర్హత, అనుభవంతో పాటు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. గత నెలలో దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు రేసులో కుంబ్లే ఉండటంతో ఎక్కువ దరఖాస్తులు రాలేదని చెప్పారు.

వైదొలగిన కుంబ్లే
అయితే ప్రస్తుతం కుంబ్లే వైదొలగడంతో చాలా మంది ఆసక్తి చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు. టీమిండియా ప్రధాన కోచ్ పదవి రేసు నుంచి కుంబ్లే తప్పుకోవడంతో తెరపైకి రవిశాస్త్రి పేరు వచ్చింది. ఆగస్టు 2014 నుంచి ఏప్రిల్ 2016 వరకు రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది.

గతంలో టీమిండియా డైరెక్టర్‌గా శాస్త్రి
2015లో అప్పటి కోచ్ డంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగిసిన తర్వాత శాస్త్రిని బీసీసీఐ టీమిండియా డైరెక్టర్‌గా నియమించింది. రవిశాస్త్రి హయాంలోనే టీమిండియా 2015లో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ వరకు వెళ్లగా, 2016లో జరిగిన వరల్డ్ టీ20లో కూడా సెమీస్‌కు చేరింది.

శాస్త్రికి కోహ్లీ మద్దతు
కాగా, బీసీసీఐ మే 31లోపు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, రిచర్ పైబస్, దొడ్డ గణేశ్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పడు దరఖాస్తు చేయని రవిశాస్త్రికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి దరఖాస్తు చేస్తాడేమోనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications