న్యూఢిల్లీ: టెస్టుల్లో టీమిండియా అరుదైన మైలు రాయిని అందుకోనుంది. 500వ టెస్ట్‌కు భారత్ సిద్ధమైంది. ఈనెల 22న కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టు భారత్‌కు 500వ టెస్ట్ మ్యాచ్. దీంతో, ఈ చారిత్రక సందర్భాన్ని వేడుకలా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది.
ఇందులో భాగంగా ఈ చారిత్రక మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీసీసీఐ భారత జట్టు మాజీ కెప్టెన్లు అందరినీ ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ మ్యాచ్ కోసం '500వ టెస్టు' అని ముద్రించిన ప్రత్యేక వెండి నాణెంతో టాస్ వేయనున్నారు. ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ) అధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు.

యూపీసీఏతో కలిసి బీసీసీఐ భారత మాజీ కెప్టెన్లకు విందు ఏర్పాటు చేస్తుందని అన్నారు. న్యూజిలాండ్, భారత జట్లు కూడా ఇందులో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ఈ మ్యాచ్ సందర్భంగా భారత జట్టు మాజీ కెప్టెన్లను సన్మానించాలని బోర్డు భావిస్తోందని చెప్పారు.
ఈ మ్యాచ్‌కి టీమిండియా మాజీ కెప్టెన్లు నారీ కాంట్రాక్టర్, చందూ బోర్డె, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, రవిశాస్ర్తి, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, శ్రీకాంత తదితరులు వేడుకకు హాజరుకానున్నారు. ఇక, బోర్డు, యూపీసీఏ '500వ టెస్ట్' ముద్రించిన టి-షర్టులను మ్యాచ్‌కు హాజరయ్యే పేద చిన్నారులకు పంచనున్నారు.