హైదరాబాద్: టెస్టుల్లో టీమిండియా అరుదైన మైలు రాయిని అందుకోనుంది. ఈనెల 22న కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టు భారత్‌కు 500వ టెస్టు మ్యాచ్. దీంతో, ఈ చారిత్రక టెస్ట్ మ్యాచ్‌ని సందర్భాన్ని ఓ వేడుకలా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది.
ఈ టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌కు 500వ టెస్టు మ్యాచ్ కావడంతో దీనికి ఓ ప్రత్యేకతను కల్పించాలనే ఉద్దేశంతో బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఉపయోగించే టాస్ కోసం ప్రత్యేకంగా ఓ వెండి నాణెంను రూపొందించింది.
ఆ వెండి నాణంపై '500వ టెస్టు' అని ముద్రించనుంది. అలాగే ఈ చారిత్రక మ్యాచ్ సమయంలో బీసీసీఐ భారత జట్టు మాజీ కెప్టెన్లు అందరినీ ఆహ్వానించాలని నిర్ణయించింది. అంతేకాదు మాజీ కెప్టెన్లను సన్మానించాలని బోర్డు భావిస్తోంది. అయితే భారత్‌కు ఘనమైన విజయాలు అందించిన మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌ను మాత్రం ఈ వేడుకలకు పిలవడం లేదు.

కాగా, మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కోర్టు అజహర్‌ను నిర్దోషి అని ప్రకటించినా బీసీసీఐ మాత్రం ఇంకా వివక్ష చూపుతుండటం పలు విమర్శలకు దారి తీస్తోంది. గతంలో చాలా మంది బోర్డుకు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఆ తర్వాతి కాలంలో క్షమించి అక్కున చేర్చుకున్న బీసీసీఐ అజహరుద్దీన్ విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోంది.
కాగా ఈ చారిత్రక టెస్ట్ మ్యాచ్‌కి మాజీ కెప్టెన్లు నారీ కాంట్రాక్టర్, చందూ బోర్డె, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, రవిశాస్ర్తి, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, శ్రీకాంత్‌లు హాజరయ్యే అవకాశాలున్నాయి.