నయా ఫినిషర్ రింకూ సింగ్‌ను మూడు ఫార్మాట్లకు సిద్ధం చేసేలా బీసీసీఐ కీలక చర్యలు చేపడుతోంది. రంజీట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న రింకూని తక్షణమే భారత్-ఎ జట్టుతో చేరమని బీసీసీఐ అతడికి మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ఎంపిక చేస్తూ రింకూకి కబురు పంపింది.
అయితే ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరగనున్న రెండు, మూడు అనధికారిక టెస్టులకు బీసీసీఐ 'ఇండియా-ఏ' జట్టును ఇటీవలే ప్రకటించింది. రింకూ సింగ్ కేవలం మూడో టెస్టుకు మాత్రమే ఎంపికయ్యాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ మాత్రం రెండు టెస్టులకూ సెలక్ట్ అయ్యారు. దీంతో రంజీ ట్రోఫీలో యూపీ తరపున బిహార్ మ్యాచ్‌లోకి రింకూ బరిలోకి దిగాడు. సోమవారం 'డ్రా'గా ముగిసిన ఆ మ్యాచ్‌లో రింకూ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి పది పరుగులు చేశాడు.

మరోవైపు విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో స్టార్ ప్లేయర్ అందుబాటులో ఉండట్లేదని వివరించింది. ఈ నేపథ్యంలో రింకూను ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండో టెస్టుకు ఎంపిక చేయడంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చివరి మూడు టెస్టులకు కూడా కోహ్లి దూరమైతే రింకూను బ్యాకప్‌గా వాడుకోవడానికి బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే కోహ్లి స్థానానికి సీనియర్ ప్లేయర్ పుజారాతో పాటు రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రంజీట్రోఫీలో సౌరాష్ట్రలో జట్టులో పుజారా, భారత్-ఎ జట్టులో యువ ప్లేయర్లు రజత్, సర్ఫరాజ్ ఉన్నారు. అయితే రజత్, సర్ఫరాజ్‌లలో ఒకరు కోహ్లి ప్లేస్‌లో టీమిండియాలోకి వెళ్లే అవకాశం ఉందని, అందుకే రింకూ రెండో టెస్టులోనూ భారత్-ఎ జట్టులో స్థానం దక్కించుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండో అనధికార టెస్టు కోసం బీసీసీఐ ఇవాళ ప్రకటించిన జట్టులోనూ రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. వారి స్థానంలో భర్తీగా రింకూ సింగ్ పేరును ప్రకటించలేదు. అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి ఇంగ్లాండ్ లయన్స్‌తో భారత్-ఎ జట్టు రెండో టెస్టు ఆడనుంది. మరోవైపు ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు గురువారం ప్రారంభం కానుంది.
రెండో అనధికార టెస్టుకు 'భారత్ -ఎ' జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్, రింకూ సింగ్
మూడో అనధికార టెస్టుకు 'భారత్- ఎ' జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్