టీమిండియా విజయోత్సవ ర్యాలీ అద్వితీయంగా ముగిసింది. వేలాది అభిమానుల మధ్య, పూల వర్షంలో భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి వైభవంగా తరలివెళ్లారు. అనంతరం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమం కొత్త వివాదానికి తెరలేపింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రాను బీసీసీఐ విస్మరించింది. దీనిపై విరాట్ కోహ్లి స్పందించడంతో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే.. వాంఖడే స్టేడియంలో బీసీసీఐ భారత ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి అట్టహాసంగా గురువారం రాత్రి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. రూ.125 కోట్ల భారీ నజరానా కూడా అందించింది. అయితే కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ వీడియో ప్రసారం చేసింది. వీడియోలో.. ఈ సారి రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందని జైషా గతంలో చేసిన ప్రసంగం, ఆ తర్వాత ఆటగాళ్లకు సంబంధించిన స్పెషల్ వీడియోలు ప్రసారం చేసింది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబెలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేసింది. కానీ ప్రపంచ ప్రమాదకర ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు సంబంధించిన వీడియో ప్రసారం కాలేదు. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రత్యర్థి గెలుపు దిశగా సాగుతున్న ప్రతి సందర్భంలో బుమ్రానే భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. అందుకే ఐసీసీ కూడా మెచ్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ఇచ్చింది.
కానీ సన్మాన కార్యక్రమంలో బుమ్రాకు సంబంధించిన వీడియో మిస్ అవ్వడం గమనార్హం. అయితే దీనిని గమనించిన విరాట్ కోహ్లి.. బుమ్రాకు ఫుల్ క్రెడిట్ ఇచ్చాడు. వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం బుమ్రానే అని, అతను భారతదేశానికి గొప్ప ఆస్తి అని కొనియాడాడు. అలాంటి బుమ్రాను ప్రత్యేకంగా అభినందించాలని అభిమానులతో చప్పట్లు కొట్టించాడు. కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో బుమ్రానే జట్టును తిరిగి మళ్లీ మళ్లీ పోటీలోకి తెచ్చాడని కోహ్లి అన్నాడు.
అయితే బుమ్రాను బీసీసీఐ విస్మరించడంపై నెట్టింట చర్చ జోరుగా సాగుతోంది. పొరపాటును వీడియో మిస్ అయ్యి ఉంటుందని కొందరు సానుకూలంగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు బీసీసీఐపై మండిపడుతున్నారు. ఫ్యూచర్ కెప్టెన్‌గా అయ్యే అవకాశం ఉన్న బుమ్రాను కావాలనే తనకి దక్కాల్సిన క్రెడిట్ తగ్గించేలా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యతో బుమ్రా కూడా ఉన్న విషయం తెలిసిందే.