
హైదరాబాద్: బీసీసీఐ ఐపీఎల్ కు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని టెస్టు మ్యాచ్ లకు ఇవ్వడం లేదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కెప్టెన్సీ చేసి తప్పుకున్న గంభీర్.. డే/నైట్ టెస్టుకు నో చెప్పిన బీసీసీఐని దృష్టిలో ఉంచుకుని ఈ సమాధానం చెప్పాడు.
'వన్డేలు, టీ20లను మార్కెట్ చేస్తున్నంతగా టెస్ట్ క్రికెట్‌ను బీసీసీఐ మార్కెట్ చేయలేకపోతుందని అనుకుంటున్నా. 2011లో ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తుంటే తొలి రోజు వెయ్యి మంది మాత్రమే స్టేడియంలో ఉన్నారు' అని గంభీర్ గుర్తు చేశాడు.
'వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలు ఆడుతుంటే వెయ్యి మంది మాత్రమే దానిని చూస్తుండడం నాకు ఇంకా గుర్తుంది' అని పేర్కొన్నాడు. క్రికెట్ చరిత్రకారుడు బోరియా ముజుందార్ రాసిన 'ఎలెవన్ గాడ్స్ అండ్ బిలియన్ ఇండియన్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ సింగ్ మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌ను టైర్-2 నగరాలకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డాడు.
వైట్ బాల్ తో ఆడటమంటే పూర్తిగా విరుద్దంగా ఉంటుంది. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడినంత మాత్రాన టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పూర్తిగా సిద్ధమైనట్లు కాదని పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఐసీసీ 'టెస్ట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్' గా అవార్డు అందుకున్న గంభీర్ .. టెస్టు మ్యాచ్‌కు ముందు వైట్ బాల్ మ్యాచ్ ఆడడం బాగా సహకరిస్తుందని తెలిపాడు.