
ముంబై: ఇంకో నెలన్నర రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ ప్రారంభం కాబోతోంది. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఈ టోర్నమెంట్‌ను రెండోదశను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే వెలువడింది. అబుధాబి, దుబాయ్, షార్జాల్లో గల స్టేడియాల్లో ఐపీఎల్ 2021లో మిగిలిపోయిన మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అర్ధాంతరంగా రద్దు చేసిన ఈ మెగా టోర్నమెంట్‌ను యుఏఈకి తరలించింది.
ఇప్పుడు కూడా కరోనా వైరస్ భయాందోళనలు బీసీసీఐని వీడట్లేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెనుముప్పు తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది బీసీసీఐ. కొద్దిరోజులుగా దేశంలో కరోనా వైరస్ రీప్రొడ్యూస్ వేల్యూ పెరుగుతోండటం, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసులు ఇంకా పూర్తిస్థాయిలో తగ్గట్లేదు. కర్ణాటకలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. పైగా ఈ నెల చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కరోనా వైరస్ థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరికలను చేస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య బీసీసీఐ అప్రమత్తమైంది. ఐపీఎల్‌లో భాగస్వామ్యులుగా కొనసాగుతోన్న ఎనిమిది ఫ్రాంఛైజీలకు కీలక సూచనలు, ఆదేశాలను జారీ చేసింది. ఐపీఎల్ 2021లో పాల్గొనడానికి విమానం ఎక్కే ప్రతి సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్, టీమ్ మేనేజ్‌మెంట్.. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలని సూచించింది. ఐపీఎల్ 2021 ఫేస్ 2తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలని పేర్కొంది. ఈ దిశగా బీసీసీఐకి హామీ ఇవ్వాలని ఆదేశించింది.
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ ఐపీల్ 2021ను యుఏఈలో నిర్వహించేలా రీషెడ్యూల్ చేసినందు వల్ల అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బీసీసీఐకి అందజేయాలని తెలిపింది. శ్రీలంక పర్యటన సందర్భంగా స్పిన్నర్ కృనాల్ పాండ్యా కరోనా వైరస్ బారిన పడటం వల్ల జట్టు మొత్తాన్నీ కూడా బీసీసీఐ ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. మొత్తంగా ఎనిమిది మంది క్రికెటర్లను ఐసొలేషన్‌లోకి పంపించింది. ఆ పరిస్థితి రాకుండా ఉండేలా ఇప్పటి నుంచే జాగ్రత్తలను తీసుకుంటోంది