హైదరాబాద్: బీసీసీఐ నుంచి సరైన అనుమతి లేకుండా నిర్వహించనున్నఇండియన్ జూనియర్ ప్రీమియర్ లీగ్ (ఐజేపీఎల్)లో గుర్తింపు పొందిన యువ క్రికెటర్లు ఎవరూ ఆడొద్దని బీసీసీఐ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు.
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి 29 వరకు ఈ లీగ్ జరగనుంది. ఈ లీగ్‌కు భారత్ తరుపున బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యవహరిస్తున్నారు. ఐసీసీ అకాడమీ మైదానంలోనే ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటీవల లీగ్ ఆరంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు ఐసీసీ లోగోని కూడా వినియోగించడం విశేషం.

అయితే, తాజాగా బీసీసీఐ తమ క్రికెటర్లని ఈ లీగ్‌కి పంపబోమని చెప్పడంతో నిర్వాహకులు షాక్‌కి గురయ్యారు. బీసీసీఐ వద్ద రిజస్టర్ చేసుకున్న క్రికెటర్లు, వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోషియేషన్‌కి చెందిన అండర్-16, అండర్-19 ఆటగాళ్లు కూడా ఇక టోర్నీలో పాల్గొనేందుకు వీలులేదని బోర్డు తెలిపింది.
ఈ మేరకు అసోషియేషన్లు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బోర్డు ఆదేశించింది. ఒక వేళ తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అండర్-16, అండర్-19 జట్లకు చెందిన ఆటగాళ్లు ఎవరన్నా లీగ్‌ల్లో ఆడితే వారిని వెంటనే బహిష్కరిస్తామని తమ లేఖలో బోర్డు పేర్కొంది.
ఇలాంటి టోర్నీలను ప్రోత్సహిస్తూ భారత క్రికెటర్లని పంపితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కళ ఎక్కడ తప్పుతుందోనని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆటగాళ్లకి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.