అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త మోడల్ ప్రకారం బీసీసీఐపై కాసుల పంట కురవనుంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఐసీసీ సైకిల్‌లో ఏటా ఏకంగా 230 మిలియన్ డాలర్లు అంటే మన లెక్కల్లో సుమారు 19 వేల కోట్లు ఆదాయం దక్కనుంది. ఐసీసీలో మిగతా భాగస్వాములతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
ఐసీసీ ఈ సైకిల్‌లో ఏకంగా 600 మిలియన్ డాలర్లు ఆదాయం పొందుతుందని అంచనా. దీనిలో 38.5 శాతం బీసీసీఐకి దక్కనుంది. వచ్చే ఐసీసీ సైకిల్‌లో బీసీసీఐ ఏటా 230 మిలియన్ డాలర్లు అందుకోనుంది. ఐసీసీలో బిగ్ త్రీగా చెప్పుకునే మూడు క్రికెట్ బోర్డుల్లో బీసీసీఐ ఒకటి. మిగతా రెండు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఈ రెండు కూడా అంత సంపాదించడం లేదు.

ఈసీబీ ఏటా 41.33 మిలియన్ డాలర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా 37.53 మిలియన్ డాలర్లు ఏటా సంపాదిస్తాయి. ఐసీసీ కేవలం మీడియా హక్కుల రూపంలోనే నాలుగేళ్లలో 3.2 బిలియన్ డాలర్లు సంపాదిస్తుందని తెలుస్తోంది. వీటిలో అధిక భాగం వచ్చేది ఇండియన్ మార్కెట్ల నుంచే వస్తుంది. ఈ నాలుగేళ్ల ఐసీసీ సైకిల్‌కు డిస్నీ స్టార్ ఏకంగా 3 బిలియన్ డాలర్లు చెల్లించింది.
ఇక ఈ మూడు ప్రధాన క్రికెట్ బోర్డుల తర్వాతి స్థానంలో పాకిస్తాన్ బాగా సంపాదించనుంది. పీసీబీకి ఏటా 30 మిలియన్ డాలర్లు అందుతాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం చూసుకుంటే.. బీసీసీఐ ఓవరాల్‌గా నాలుగేళ్లలో 924 మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది. అయితే ఐసీసీ సంపాదన కనుక పెరిగితే.. బీసీసీఐ సంపాదన ఈజీగా బిలియన్ డాలర్ల మార్కు దాటేస్తుంది.
ఈ సంపాదనలో రెండో స్థానంలో ఉన్న ఈసీబీతో పోలిస్తే బీసీసీఐ సంపాదన 82 శాతం ఎక్కువ. ఈసీబీ ఈ నాలుగేళ్లలో కేవలం 165 మిలియన్ డాలర్లే సంపాదిస్తుంది. అయితే అప్పుడే ఈ సంపాదన లెక్కలు పరిగణనలోకి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ కొత్త డిస్ట్రిబ్యూషన్ మోడల్‌పై మిగతా బోర్డులు ఇంకా ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు. ఈ తంతు కూడా పూర్తయిన తర్వాత ఈ మోడల్ అమల్లోకి వస్తుంది.