న్యూఢిల్లీ: బీజింగ్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన అభినవ్ బింద్రాపై ప్రోత్సహకాల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అభినవ్ బింద్రాకు 25 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది. బింద్రాకు బిసిసిఐ 25 లక్షల రూపాయలు ఇస్తుందని, తాము మద్దతు ఇస్తున్న బిసిసఐ అథ్లెట్ల జట్టులో బింద్రా ఇప్పటికే ఉన్నాడని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు.
అభినవ్ బింద్రాను భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ అభినందించారు. తాను స్వయంగా బింద్రాను అభినందించాలనుకున్నానని, అయితే సాధ్యం కాలేదని, ఈ రకంగా బింద్రాను తాను అభినందిస్తున్నానని ధోనీ అన్నారు. బింద్రా స్వర్ణ పతకం సాధించడం ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తి కాగలదని యువరాజ్ సింగ్ అన్నారు.