బీసీసీఐ ఎవరికీ అన్యాయం చేయదు: రాజీవ్ శుక్లా
భారత క్రికెట్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అనంతరం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక ప్రకటన చేశారు. బీసీసీఐ ఏ ఆటగాడి పట్ల వివక్ష చూపదని ఆయన పేర్కొన్నారు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే టీమిండియా తరఫున బరిలోకి దిగి చరిత్ర సృష్టించన వైభవ్ సూర్యవంశీకి రాజీవ్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని రోజులుగా వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లను టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలకు రాజీవ్ శుక్లా గట్టి సమాధానం ఇచ్చారు.
రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. "అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. బీసీసీఐ ఏ ఆటగాడి పట్ల పక్షపాతం చూపదు, ఎవరికీ అన్యాయం చేయదు. కేవలం అర్హత, టాలెంట్ ఆధారంగానే ప్లేయర్లకు సరైన సమయంలో ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. వైభవ్ సూర్యవంశీకి కావాలనే జట్టులో అవకాశం ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ఓ రకమైన వాతావరణాన్ని సృష్టించారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం వస్తుందని నేను ఇదవరకే చెప్పాను.. ఇప్పుడదే జరిగింది. ఎలాంటి కారణం లేకుండా కెప్టెన్, కోచ్‌లను విమర్శించడం సరికాదు. జట్టు యాజమాన్యం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అందరూ అభినందించాలి" అంటూ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.

సోషల్ మీడియా ఒత్తిళ్లకు లొంగి కాకుండా, జట్టు అవసరాలు, ఆటగాడి సంసిద్ధతను బట్టే ఎంపిక జరుగుతుందని స్పష్టం చేసిన రాజీవ్ శుక్లా.. వైభవ్ సూర్యవంశీపై పూర్తి నమ్మకాన్ని వ్యత్చం చేశారు. భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడనే విశ్వాసాన్ని కనబరిచారు. ఇది కేవలం ఓ ఆరంభం మాత్రమేనని.. ఈ యువ క్రికెటర్‌కు సుదీర్ఘ కెరీర్ ఉందని.. వైభవ్ ఇలాగే కష్టపడితే భారత క్రికెట్ కు ఓ పెద్ద స్టార్ దొరికినట్లేనని కొనియాడారు.
ఇంగ్లాండ్ జట్టుతో మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయస్సులోనే టీమిండియా జెర్సీ ధరించిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మహిళా క్రికెటర్ షఫాలీ వర్మల రికార్డులను బద్దలు కొట్టి.. అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే తన అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 10 బంతుల్లో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications