ముంబై: ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో ఆడేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యల పైన బిసిసిఐ బుధవారం నాడు స్పందించింది. మొహాలీలో న్యూజిలాండుతో జరిగే మ్యాచ్‌కు కాశ్మీర్ ప్రజలు చాలామంది తమకు మద్దతుగా తరలి వచ్చారని అఫ్రిది వ్యాఖ్యానించారు.
దీనిపై బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. అఫ్రిది వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అఫ్రిది ఇలాంటి ప్రకటన చేయడం రాజకీయంగా సరికాదన్నారు. క్రీడాకారులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో అఫ్రిదిని విమర్శించేందుకు ఇదే కారణమన్నారు.
పాకిస్తాన్‌లో కంటే తమకు భారత్‌లోనే ఎక్కువ అభిమానం లభిస్తోందని అఫ్రిది కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించి పాకిస్తాన్‌లో ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పైన సీనియర్లు, పాక్ అభిమానులు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు.

ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ కోణంలో ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్ జట్టుతో తాము తలపడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు జమ్మూకాశ్మీర్ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారని అఫ్రిది అన్నాడు.
మొహాలిలో మంగళవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టాస్ కోసం వచ్చిన అఫ్రిదిని చూసి జనాలు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. 'మీకు ఇక్కడ బాగానే అభిమానగణం ఉన్నట్లుందే' అని పాకిస్థాన్ మాజీ ఆటగాడైన వ్యాఖ్యాత రమీజ్ రాజా.. షాహిద్‌ను అడిగాడు.
దీనికి స్పందిస్తూ.. 'అవును మాకు చాలామంది అభిమానులున్నారు. కాశ్మీర్ నుంచి చాలామంది మాకోసం వచ్చారు' అని అఫ్రిదీ అన్నాడు. భారత్‌లో భాగమైన కాశ్మీర్ నుంచి.. పాక్ కోసం అభిమానులు వచ్చారనే అర్థంతో అఫ్రిది వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది.
అఫ్రిది వ్యాఖ్యలు రాజకీయ కోణంలో ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌లో పాక్‌కు అనుకూలంగా జెండాలు ఎగురుతాయనే విషయం తెలిసిందే. బుధవారం కూడా పాక్ అనుకూల జెండాలు వెలిశాయి. భారత దేశంలో తమకు ఎక్కువ ప్రేమ ఉంటుందన్నప్పుడు అఫ్రిదిని ఇక్కడ ఎవరూ తప్పుపట్టలేదు. కానీ కాశ్మీర్లో అంటూ ప్రత్యేకంగా చెప్పడాన్ని తప్పుబడుతున్నారు. ఇది రాజకీయ వ్యాఖ్యనే అంటున్నారు.