
ఢిల్లీ: అంటిగ్వాలో వెస్టిండీస్-ఎతో నిర్వహించిన అనధికార వన్డే సిరీస్‌ను భారత్-ఎ జట్టు 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్-ఎ జట్టు సభ్యులపై బీసీసీఐ ప్రశంసల జల్లు కురిపించింది. 'వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్-ఎకు అభినందనలు' అని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ వేదికగా తెలిపింది. అంతేకాదు ఐదు మ్యాచుల ఫలితాల్ని ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
వెస్టిండీస్-ఏతో జరిగిన సిరీస్‌లో భారత్ -ఏ జట్టు అద్భుతంగా రాణించింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఐదో వన్డేలో విండీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యంను భారత-ఏ జట్టు 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ (99), శుబ్‌మన్ గిల్ (69), శ్రేయస్ అయ్యర్ (61)లు రాణించారు.
శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో టోర్నీ టాప్ బ్యాట్స్‌మన్‌గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా శుభ్‌మన్ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసాడు. 'అద్భుత సిరీస్ ఇది. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. భారత్ బ్లూ జెర్సీ ధరించడాన్ని ఎప్పుడూ గర్వంగా భావిస్తా' అని ట్వీటాడు. బౌలింగ్‌లో స్పిన్నర్ క్రునాల్ పాండ్య, ఫాస్ట్ బౌలింగ్‌లో నవదీప్‌లు రాణించారు. నవదీప్ టోర్నీలోనే అత్యధిక వికెట్లు సాధించాడు. ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా టీ20 జట్టులో నవదీప్, పాండ్యలు చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్‌ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్‌సైనీ.