న్యూఢిల్లీ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందా లేదా అన్న ఉత్కంఠ వీడింది. సుప్రీం కోర్టు నియమించిన పాలక కమిటీ హెచ్చరికలకు బీసీసీఐ తలొగ్గింది.
ఇంగ్లాండ్‌లో జూన్ 1 నుంచి నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడనుంది. ఆదివారం నిర్వహించిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. జట్టు ఎంపిక ఎప్పుడో తెలియనుంది.
ఐసీసీ నూతన ఆదాయ పంపిణీ నమూనాలో భారత వాటాకు భారీ గండి పడిన విషయం తెలిసిందే. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ వైదొలగితే ట్రోఫీ కళ తప్పుతుందని బీసీసీఐలోని ఓ వర్గం భావించింది.

అప్పుడు ఐసీసీ దారిలోకి వస్తుందని ఆశించింది. దీనిని సుప్రీం కోర్టు పాలకుల కమిటీ సహా మాజీ క్రీడాకారులు వ్యతిరేకించారు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడమే మంచిదన్నారు.
వ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటే భారత్ ఎనిమిదేళ్ల పాటు ఐసీసీలో ఆడే పరిస్థితి ఉండదని, అవసరమైతే సుప్రీం వెళ్తామని పాలకుల కమిటీ అధినేత వినోద్‌రాయ్ హెచ్చరించారు.
కోచ్ కుంబ్లే సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడేందుకే నిర్ణయం తీసుకొంది. ఆదివారం ఉదయం ప్రత్యేక సర్వ సభ్య సమావేశం జరిగింది.