గంగూలీ ఉండగా దీనిని జరగనివ్వడు: నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనపై షోయబ్ అక్తర్

హైదరాబాద్: సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ.. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లను నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రతిపాదనను తిరస్కరించడం ఖాయమని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ధీమా వ్యక్తం చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేందుకు గాను ఐసీసీ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
ఐసీసీ తీసుకొచ్చిన ఈ నాలుగు రోజుల టెస్టు క్రికెట్ ప్రతిపాదనపై షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ "ప్రతిచోటా ఈ కుట్ర ఉంది. ఈ రోజుల్లో ఆసియా జట్లకు వ్యతిరేకంగా ఒక సిద్ధాంతం. ఇది (టెస్ట్‌ను నాలుగు రోజులకు తగ్గించడం) పూర్తిగా ఆసియా జట్లకు వ్యతిరేకంగా ఉందని నేను భావిస్తున్నాను" అని అన్నాడు.
ఇదొక చెత్త ఆలోచన
"ఇదొక చెత్త ఆలోచన అని నేను భావిస్తున్నాను, దీనిపై ఎవరూ ఆసక్తి చూపకూడదు" అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. అయితే, సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ.. ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను తిరస్కరించడం ఖాయమని ఈ సందర్భంగా షోయబ్ అక్తర్ ధీమా వ్యక్తం చేశాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను చంపాలని దాదా ఎప్పటికీ అనుకోడని అన్నాడు.

ఐసీసీ ప్రతిపాదనకు
ఐసీసీ ప్రతిపాదనకు ఏ ఒక్కరూ సానుకూలంగా స్పందించడం లేదని, ఇదొక చెత్త నిర్ణయమని షోయబ్ విమర్శించాడు. "గంగూలీ ఒక క్రికెట్ మేధావి. దీనికి అతడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ సిగ్నల్ లభించదు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్, మెక్‌గ్రాత్, రికీ పాంటింగ్‌లు నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇక పాకిస్తాన్ నుంచి కూడా క్రికెట్ పెద్దలు దీనిపై పెదవి విప్పాలి" అని అక్తర్ అన్నాడు.

విరాట్ కోహ్లీ సైతం ఇలా
కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచన సరైంది కాదని అన్నాడు. ఏదో మార్పు చేయాలనే యోచనతో టెస్టు క్రికెట్‌ను నాలుగు రోజులకు కుదించడం మంచిది కాదని ఆదివారం గువహటి వేదికగా శ్రీలంకతో తొలి టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ అన్నాడు.

డే-నైట్ టెస్టులో ఏమైనా మార్పు
కోహ్లీ మాట్లాడుతూ "డే-నైట్ టెస్టులో ఏమైనా మార్పు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా మార్చడానికి యత్నిస్తే బాగుంటుంది. డే-నైట్ టెస్టు విజయవంతమైన క్రమంలో దానిపై కసరత్తు చేస్తే బాగుంటుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను ఒక రోజుకు తగ్గించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు" అని పేర్కొన్నాడు.

నాథన్ లియోన్ సైతం వ్యతిరేకం
నాలుగు రోజుల టెస్టు క్రికెట్ ప్రతిపాదనను ఆసీసీ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ సైతం వ్యతిరేకించాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ముందు వారి ప్రతిపాదన పరిశీలించాలి. అది ఆచరణలోకి వచ్చాక ఆలోచించాలి. ఇప్పుడే దాని గురించే స్పందిస్తే అది తొందరపాటు అవుతుంది" అని అన్నాడు. 2023-2031 షెడ్యూల్ నుంచి ఈ మార్పులు చేయనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications