
కోల్‌కత: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జగ్‌దీప్ ఢంకర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయడం వరసగా ఇది మూడోసారి. ఇదివరకు 2011, 2016ల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాజ్‌భవన్‌లో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. పరిమితంగా ఆహ్వానితులు హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు, మమతా బెనర్జీ సమీప బంధువు అభిషేక్ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి హాజరయ్యారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరబ్ గంగూలీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు క్రికెటర్లు విజయం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.

తృణమూల్ కాంగ్రెస్ తరఫున మనోజ్ తివారీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అశోక్ దిండా అసెంబ్లీలో అడుగు పెట్టబోతోన్నారు. మనోజ్ తివారీకి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ నాయకులు ఎన్నికలకు ముందు బీజేపీలోకి వలస వెళ్లినందున.. మమతా బెనర్జీ ఈ సారి యువరక్తాన్ని ప్రోత్సహిస్తారని సమాచారం. ఇందులో భాగంగా మనోజ్ తివారీకి మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. అలా కుదరకపోతే పార్టీలో కీలక పదవిని అప్పగించే అవకాశాలు లేకపోలేదని పశ్చిమ బెంగాల్ రాజకీయాలు స్పష్టం చేస్తున్నాయి.