హైదరాబాద్: టీమిండియాకు ప్రధాన కోచ్‌ని ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతమైంది. కొత్త కోచ్ విషయంలో కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ వెస్టిండిస్‌కు పయనమయ్యాడు.
ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జోహ్రి బుధవారం జమైకాకు బయల్దేరి వెళ్లాడు. కొత్త కోచ్‌తోపాటు సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో కోహ్లీతో పాటు జట్టు సభ్యుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు.
బీసీసీఐ క్రికెట్ పరిపాలనా కమిటీ (సీఓఏ) అనుమతి తీసుకుని రాహుల్ జోహ్రీ జమైకాకు వెళ్లారని బీసీసీఐ అధికారి చెప్పారు. కెప్టెన్, జట్టు సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకుంటారని దానిని సీఓఏకు అందజేసే బాధ్యతను ఆయనకు అప్పజెప్పారని ఆ అధికారి వెల్లడించారు.

నిజానికి కొత్త కోచ్ ఎంపిక విషయంలో జట్టు అభిప్రాయాన్ని కూడా సీఓఏ తెలుసుకోవాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరగనున్న ఆఖరి వన్డే కోసం భారత జట్టు ప్రస్తుతం జమైకాలో ఉంది.
ఇదిలా ఉంటే కోచ్‌గా అనిల్ కుంబ్లే తప్పుకున్న నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియకు తుది గడువుని బీసీసీఐ జులై 9వరకు విధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డైరక్టర్ రవిశాస్త్రితో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులకు సచిన్ టెండూల్కర్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ జులై 10న ఇంటర్యూ నిర్వహించనుంది. అనంతరం అదే రోజున కోత్త కోచ్ ఎవరనేది అధికారిక ప్రకటన చేయనుంది.