BCCI Central Contract: భారత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గత సంవత్సరం టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తమ A+ ఒప్పందాలను నిలుపుకోనున్నారు. రోహిత్, విరాట్ ఇకపై మూడు ఫార్మాట్లలో ఆడనప్పటికీ భారత క్రికెట్ కు వారు చేసిన అసాధారణ కృషికి బీసీసీఐ కేంద్ర ఒప్పందాలను కొనసాగించనున్నట్లు సమాచారం. 2025-26 సంవత్సరానికి వారి ఏ ప్లస్ గ్రేడ్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను కొనసాగించనున్నారు. దీని వల్ల రోహిత్, విరాట్ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ వారికి రూ.7 కోట్లు లభిస్తాయి.
2023-24లో బీసీసీఐ కేంద్ర కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడిన శ్రేయస్ అయ్యర్ ను తిరిగి జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అయితే దేశీయ క్రికెట్‌కు దూరమైన కారణంగా గతంలో తొలగించబడిన శ్రేయాస్ అయ్యర్‌ను జాబితాలోకి తిరిగి చేర్చే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత టెస్టు జట్టు నుండి తొలగించబడిన తర్వాత ముంబై తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడటానికి నిరాకరించినప్పుడు శ్రేయాస్ అయ్యర్ సెలక్షన్ కమిటీతో వివాదంలో పడ్డాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ వెన్ను గాయం కారణంగా తాను రెడ్-బాల్ క్రికెట్ ఆడలేకపోయానని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ ఐదు ఇన్నింగ్స్ లలో 243 పరుగులతో జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

"టీ20ఐ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా రోహిత్, విరాట్ తమ A+ గ్రేడ్ సెంట్రల్ కాంట్రాక్టును (7 కోట్లు) కొనసాగిస్తారు. వారు పెద్ద ఆటగాళ్లు, వారికి తగిన గౌరవం లభిస్తుంది. శ్రేయస్ అయ్యర్ తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇషాన్ కిషన్‌కు అవకాశం లేదు..
శ్రేయస్ అయ్యర్‌తో పాటు సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలగించబడిన ఇషాన్ కిషన్.. తన స్థానాన్ని తిరిగి పొందడానికి ఎక్కువకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. రాబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వికెట్ కీపర్-బ్యాటర్ ఉండే అవకాశం లేదు. నవంబర్ 2023 నుండి కిషన్ ఏ ఫార్మాట్‌లోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించలేదు. దక్షిణాఫ్రికా పర్యటనను మధ్యలో వదిలివేసిన తర్వాత ఇషాన్ కిషన్ మొత్తం 2023-24 దేశీయ సీజన్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో తిరిగి ఆటలోకి వచ్చాడు. 2024-25 సీజన్‌లో అన్ని ఫార్మాట్లలో జార్ఖండ్ తరపున ఆడినప్పటికీ, ఆస్ట్రేలియాలో రెండు మ్యాచ్‌ల ఫస్ట్-క్లాస్ సిరీస్ కోసం ఇషాన్ కిషన్‌ను ఇండియా 'ఎ' జట్టులో మాత్రమే చేర్చారు. ఇషాన్ కిషన్ తన స్థానాన్ని తిరిగి పొందేందుకు ఇంకా తగినంత ప్రయత్నాలు చేయకపోవడంతో కేంద్ర కాంట్రాక్టుల్లో తిరిగి చేరడానికి ముందు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఓ నివేదిక పేర్కొంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుండి ఆటగాళ్లు ఎంత సంపాదిస్తారు?
గ్రేడ్ A+ ఆటగాళ్ళు - రూ. 7 కోట్లు
గ్రేడ్ A ఆటగాళ్ళు - రూ. 5 కోట్లు
గ్రేడ్ B ఆటగాళ్ళు - రూ. 3 కోట్లు
గ్రేస్ C ఆటగాళ్ళు - రూ. 1 కోటి