వన్డే వరల్డ్ కప్‌పై ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వేయాలని డిసైడ్ అయిందట. ఈ క్రమంలోనే ఈ నెల 27న ప్రత్యేక జనరల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈసారి వన్డే వరల్డ్ కప్ భారత దేశంలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ టోర్నీ మొదలవుతుందని సమాచారం.
ఈ టోర్నీని విజయవంతం చేయడం కోసం ఐదు పాయింట్ల ఎజెండాను ఈ మీటింగ్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో కూడా బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. వన్డే వరల్డ్ కప్ వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఈ మీటింగ్‌లో నియమిస్తారట. ఈ గ్రూప్‌లో బీసీసీఐ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, యాక్టింగ్ సీఈవో సహా పలువురు సీనియర్ అధికారులు ఉంటారట.

ఈ మెగా టోర్నీకి అవసరమైన విధంగా స్టేడియాలకు మరమ్మతులు చేయించడం, ప్రేక్షకులకు మరిన్ని సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాట్లు చేయడం వంటి విషయాలపై ఈ గ్రూప్ ఫోకస్ పెడుతుందని తెలుస్తోంది. అలాగే వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహించే స్టేడియాలను ఫైనలైజ్ చేయడంపై కూడా ఈ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంటుందట.
వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. అదే సమయంలో పాకిస్తాన్ టీం ఇక్కడకు వస్తుందా? లేదా? అనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఆసియా కప్ విషయంలో పాక్, భారత్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ కనుక ఆసియా కప్ కోసం తమ దేశానికి రాకుంటే.. తాము వరల్డ్ కప్ కోసం భారత్‌కు రాబోమని పలువురు పాక్ దిగ్గజాలు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని, ఏయే స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించాలనే విషయంపై సరైన నిర్ణయం తీసుకునేందుకు వరల్డ్ కప్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలలో జరిగే మీటింగ్‌లోనే ఈ గ్రూప్ సభ్యుల పేర్లు కూడా ఫైనలైజ్ అవుతాయని సమాచారం.