టీమిండియా యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఇద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనల మేరకు మూడు టెస్టులు ఆడటంతో ఈ ఇద్దరిని ఏడాదికి కోటి రూపాయల ఫీజుతో సెంట్రల్ కాంట్రాక్ట్-సీ లిస్ట్‌లో చేర్చింది.
అయితే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు నిరాశే మిగిలింది. వారి కాంట్రాక్ట్‌లను పునరుద్ధరించడానికి బీసీసీఐ ఆసక్తి కనబరచలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరల్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటికీ సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ రెండు టెస్టులు మాత్రమే ఆడారు. రూల్స్ ప్రకారం ఆటగాళ్లు కనీసం మూడు టెస్టులు ఆడాలి. దీంతో ఆ సమయంలో జాబితాలో చోటు సంపాదించుకోలేకపోయారు.

మరోవైపు శ్రేయస్, ఇషాన్‌పై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. రంజీట్రోఫీలో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదని కారణంతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మూడు టెస్టుల్లో అయిదు ఇన్నింగ్స్‌ల్లో 200 పరుగులు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచి 50 సగటుతో పరుగులు సాధించాడు.
ఇక వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్ కూడా ఆకట్టుకున్నాడు. మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 63 సగటుతో 190 రన్స్ చేశాడు. రాంచి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. 90, 39 నాటౌట్ స్కోర్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.కాగా, అపెక్స్ కౌన్సిల్‌లో రంజీ ట్రోఫీ సీజన్ క్యాలెండర్ గురించి కూడా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంది. ఇకపై జనవరిలో ఉత్తరాదిన వాతావరణ పరిస్థితులు అంచనా వేసి మ్యాచ్‌లు నిర్వహించనుంది. అక్కడ మంచు, వెలుతురు లేమి సమయాల్లో మ్యాచ్ కొనసాగించడం సవాలుగా ఉంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:
గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య
గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వీ జైస్వాల్
గ్రేడ్ C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్.