
ఐపీఎల్ మినీ వేలంలో మళ్లీ పాత రూల్‌ను తీసుకొచ్చింది బీసీసీఐ. దీని వల్ల బీసీసీఐకి కాసుల పంట పండనుంది. అదే సైలెంట్ టై-బ్రేకర్ నిబంధన. దీని ప్రకారం, రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు ఎవరైనా ఆటగాడి కోసం చివరి వరకు పోరాడితే ఈ రూల్ వర్తిస్తుంది. అంటే సదరు ఫ్రాంచైజీ బడ్జెట్ దాటిపోయినా అతని కోసం పోటీ ఆగకపోతే. అప్పుడు ఆ జట్లతో వేలం నిర్వాహకులు సమావేశం అవుతారు. సదరు ఆటగాడి కోసం ఆ ఫ్రాంచైజీలు ఎంత వరకు ఖర్చు చేయాలని అనుకుంటున్నాయో ఒక ఫాంపై లెక్క తీసుకుంటారు.
ఈ ఫామ్‌లో పేర్కొన్న మొత్తం.. సదరు ఫ్రాంచైజీ దగ్గర ఉన్న సొమ్ము కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎవరో ఒక విజేత తేలే వరకు ఈ రహస్య వేలం జరుగుతుంది. దీనిలో ఎక్కువ పాడిన వారికి సదరు ప్లేయర్ దక్కుతాడు. ఈ సొమ్ము ఐపీఎల్‌లో ఆ ఫ్రాంచైజీ క్యాప్ కన్నా అధికంగా ఉండొచ్చు. ఇలా అదనంగా పాడిన సొమ్మును ఆక్షన్ ముగిసిన నెల రోజుల్లోగా బీసీసీఐకి సదరు ఫ్రాంచైజీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఆటగాడికి మాత్రం వేలంలో మూడు ఫ్రాంచైజీల్లో అత్యధికంగా వచ్చిన బిడ్ సొమ్మును చెల్లిస్తారు. ప్రస్తుతం ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కూడా ఫ్రాంచైజీలను ఊరిస్తోంది.
ఈ నేపథ్యంలో కొంత మంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు చివరి వరకు పోరాడే అవకాశాలు చాలానే ఉన్నాయి. దీంతో ఈ సైలెంట్ టై-బ్రేకర్ నిబంధనతో బీసీసీఐకి బాగానే లాభం ఉంటుంది. అయితే శామ్ కర్రాన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్ వంటి హాట్ పిక్ ఆటగాళ్ల వేలం ముందుగానే జరిగిపోతుంది. ఎందుకంటే వీళ్లు తొలి 13 సెట్లలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ల విషయంలో ఈ సైలెంట్ టై-బ్రేకర్ నిబంధన ఉపయోగించే ఛాన్స్ దాదాపు లేనట్టే.