నాలుగేళ్ల తర్వాత వార్షిక అవార్డుల ఫంక్షన్‌ను బీసీసీఐ నిర్వహించనుంది. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్‌ను 2020 జనవరిలో నిర్వహించారు. కరోనా లాక్‌డౌన్‌కు రెండు నెలల ముందుగా జరిగిన ఈ ఫంక్షన్‌లో 2018-19 క్రికెట్ ఏడాదికి గానూ అవార్డులు అందజేశారు.
బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఏడాది క్యాలెండర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు పాలీ ఉమ్రిగర్ అవార్డును ఇస్తారు. అలాగే మాజీ ఆటగాళ్లకు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేస్తారు. కాగా, 2023 ఏడాదికిగానూ ఈ అవార్డులను టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి ఎంపికైనట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. గిల్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డు, రవిశాస్త్రికి లైఫ్ టైమ్ అచివ్‌మెంట్ అవార్డులతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు.

గతేడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 48 మ్యాచ్‌ల్లో 46 సగటుతో 2154 పరుగులు చేశాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి 35 మ్యాచ్‌ల్లోనే 2048 పరుగులు చేశాడు. 66 సగటుతో పరుగులు చేశాడు. దీంతో ఇటీవల వన్డే ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన కోహ్లికే బీసీసీఐ వార్షిక అవార్డు లభిస్తుందని విశ్లేషకులు భావించారు. కానీ, వన్డేల్లో వేగంగా 2000 పరుగులు సాధించిన గిల్‌ను ఉత్తమ క్రికెటర్ అవార్డుకు బీసీసీఐ ఎంపిక చేసింది.
ఉమెన్స్ విభాగంలో ఉత్తమ క్రికెటర్ అవార్డు ఎవరికి దక్కుతుందనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. చివరిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెన్స్ క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా, ఉమెన్స్ విభాగంలో పూనమ్ యాదవ్ పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌కు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.
కాగా, బీసీసీఐ అవార్డుల ఫంక్షన్‌కు టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతేగాక కఠోర సాధన చేస్తున్నారు. మరోవైపు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. చివరి మూడు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడు.