
హైదరాబాద్: క్రికెట్‌లో సాధించిన విజయాలకు గాను మంగళవారం భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకోగా, స్మృతి మంధానకు అర్జున అవార్డు లభించింది.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదగా విరాట్ కోహ్లీ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకోగా... ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న స్మృతి మంధాన ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిల తర్వాత ఈ పురస్కరాన్ని అందుకున్న మూడో క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
దీంతో క్రీడాపురస్కారాలను అందుకున్న విరాట్ కోహ్లీ, స్మృతి మంధానలకు భారత క్రికెట్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అభినందించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో వీరిద్దరిని అభినందిస్తూ ట్వీట్ చేసింది.