
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అఫీషియల్ పార్ట్‌నర్‌గా బెంగళూరుకు చెందిన ఎడ్యూ-టెక్ సంస్థ 'అన్అకాడమీ' వ్యవహరిస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన అన్అకాడమీ.. మూడేళ్లకు గానూ సుమారు రూ.130 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.
ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఐపీఎల్ 2020 నుంచి 2022 వరకు అఫీషియల్ పార్ట్‌నర్‌గా అన్అకాడమీ ఉండటం మాకు సంతోషంగా ఉందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు. 'ఐపీఎల్ 2020 నుండి 2022 వరకు అధికారిక భాగస్వామిగా అన్అకాడమీ ఉండడం మాకు సంతోషం. భారతదేశంలో అత్యధికంగా చూసే క్రికెట్ లీగ్ ఐపీఎల్. అన్అకాడమీ ప్రేక్షకులపై ప్రభావం చూపగలదని మేము నమ్ముతున్నాం' అని బ్రిజేష్ అన్నారు.
అన్అకాడమీ మార్కెటింగ్ హెడ్ కరణ్ ష్రాఫ్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ అధికారిక భాగస్వామి కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐ మరియు ఐపీఎల్‌లకు కృతజ్ఞతలు. ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో అనాకాడమీని అతిపెద్ద బ్రాండ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తాం' అని పేర్కొన్నారు. ఐపీఎల్ 2020 అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్‌షిప్ నుంచి 'ఫ్యూచర్ గ్రూప్' ఇటీవల తప్పుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 వ్యవహరించనుంది. భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఆ దేశానికి చెందిన వివో కంపెనీని టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. ఇక బిడ్స్ దాఖలు చేసిన బైజూస్, అన్అకాడమీలను కాదని డ్రీమ్ 11కి ఐపీఎల్ స్ఫాన్సర్‌షిప్‌ని బీసీసీఐ కట్టబెట్టింది. డ్రీమ్ ఎలెవన్ రూ.222 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకుంది.