
వెస్టిండీస్ గడ్డపై జరిగిన అండర్ 19 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో యువ ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లకు భారీగా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి 40 లక్షల రూపాయలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అలాగే జట్టు సహాయక సిబ్బందిలో ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. యువ భారత్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జైషా.. గర్వపడేలా చేశారంటూ కొనియాడారు. అలాగే హెడ్‌కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కూడా జైషా అభినందించారు.
అలాగే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా యువ భారత్‌ను అభినందించారు. వరల్డ్‌కప్‌ను అద్భుతంగా గెలిచారంటూ కొనియాడారు. ఆటగాళ్లకు సపోర్టింగ్ స్టాఫ్‌కు అభినందనలు తెలిపారు. యంగ్ ఇండియా సాధించిన విజయం ముందు తాము ప్రకటించిన 40 లక్షల రూపాయల బహుమతి ఒక ప్రశంసా చిహ్నం లాంటిదని పేర్కొన్నారు. యువ భారత్ కృషికి విలువ కట్టలేమన్నారు.
అలాగే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యవరాజ్‌సింగ్ కూడా యువ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బౌలర్లు రవి కుమార్, రాజ్‌బవా అద్బుతమైన స్పెల్‌లు వేశారని కొనియాడాడు. భారత్ క్రికెట్ భవిష్యత్ ఉజ్వలంగా కనిపిస్తుందన్నాడు. ఈ విజయంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.
కాగా శనివారం జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ అండర్ 19 జట్టు భారత బౌలర్ల ధాటికి 189 పరుగులకే కుప్పుకూలింది. ఆ జట్టు బ్యాటర్లలో జేమ్స్ రూ మినహా ఎవరూ రాణించలేకపోయారు. రూ ఒక్కడే 95 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.
భారత బౌలర్లలో రాజ్ బవా 5, రవి కుమార్ 4 వికెట్లతో చెలరేగారు. కౌశల్ థాంబే ఒక వికెట్ తీశాడు. అనంతరం 190 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా అండర్ 19 జట్టు 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బ్యాటర్లలో షేక్ రషీద్, నిశాంత్ సింధు హాఫ్ సెంచరీలతో రాణించారు. బౌలింగ్‌లో 5 వికెట్లతో చెలరేగిన రాజ్ బవా బ్యాటింగ్‌లోనూ 35 పరుగులతో రాణించాడు. ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజ్ బవాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.