న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) మంగళవారం రూ. 2కోట్ల నజరానా ప్రకటించింది. 337 పరుగులతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన నాలుగో టెస్టును గెలిచిన టీమిండియా.. సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
మొహాలీలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 108 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మూడో టెస్టులో 124 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. బెంగళూరులో జరగాల్సిన రెండో టెస్ట్ వర్షం కారణంగా రద్దయింది.

'దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్నందుకు బిసిసిఐ టీమిండియాకు రూ. 2కోట్లు అవార్డును ప్రకటించింది' అని బిసిసిఐ ట్వీట్ చేసింది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై జరిగిన సమావేశానికి బిసిసిఐ పెద్దలందరూ హాజరయ్యారు.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ద్వితీయ స్థానానికి చేరుకుంది. కాగా, దక్షిణాఫ్రికా అత్యధిక పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.