హైదరాబాద్: మొబైల్ తయారీ సంస్థ ఒప్పొ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీమిండియా స్పాన్సర్‌షిప్ హక్కులను ఐదేళ్ల పాటు సొంతం చేసుకున్నట్లు బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఇకపై టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై స్టార్‌కు బదులు ఒప్పో కనిపించనుంది.
ఏప్రిల్ 2017 నుంచి ఒప్పోతో బీసీసీఐ స్పాన్సర్‌షిప్ మొదలవనుంది. ఈ ఒప్పందం ఐదేళ్ల కాలానికి కుదుర్చుకుంది. అంతకముందు బీసీసీఐ-స్టార్ ఇండియా మధ్య జరిగిన స్పాన్సర్‌షిప్ ఒప్పందం మార్చి నెలతో ముగియనుంది. అయితే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించేందుకు 'స్టార్ ఇండియా' నిరాకరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బీసీసీఐ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, స్పష్టత కనిపించడం లేదని స్టార్ ఇండియా చైర్మన్ అండ్ సీఈవో ఉదయ్ శంకర్ పేర్కొన్నారు. దీంతో జెర్సీ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కొనసాగించేందుకు జరిగే బిడ్డింగ్‌లో తాము పాల్గొనబోమని ఆయన చెప్పారు. మంగళవారం దాఖలైన బిడ్స్‌ను తెరిచిన బీసీసీఐ విజేతను ప్రకటించింది.
టీమిండియా ఆడే ఒక్కో ద్వైపాక్షిక మ్యాచ్‌కు కనీస ధరను రూ. 2.2 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. అదే ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆడే ఒక్కో మ్యాచ్‌కు ఈ కనీస ధర రూ.70 లక్షలుగా నిర్ణయించింది. గతంలో స్టార్ ఇండియా చెల్లించిన దానికంటే ఇది 15 శాతం అదనం. అయితే ఒప్పో ఎంత మొత్తం చెల్లించిందనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఇప్పటివరకు టీమిండియా స్పాన్సర్‌షిప్‌లో అత్యధికంగా ఒక్కో మ్యాచ్‌కు రూ. 3.34 కోట్లు చెల్లించిన రికార్డు మాత్రం సహారా ఇండియా పరివార్ పేరిట ఉంది. జెర్సీ స్పాన్సరర్‌గా ఎంపికైన సంస్థ పేరుని భారత పురుషుల, మహిళల సీనియర్ జట్లతోపాటు అండర్ 19, ఇండియా 'ఏ' జట్ల జెర్సీలపై కూడా ముద్రిస్తారు.