
ముంబై: టీమిండియాకి కొత్త కిట్ స్ఫాన్సర్ ఖరారు అయింది. భారత క్రికెటర్లు వేసుకునే జెర్సీలకు ఇక మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. నైక్ స్థానంలో ఎంపీఎల్‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ క్రికెట్ జట్టుకు మూడేళ్ల పాటు (ఈ ఏడాది నవంబరు నుంచి డిసెంబరు 2023 వరకూ) ఎంపీఎల్ స్పాన్సర్‌గా ఉంటుంది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఈ విషయాన్ని సోమవారం ద్రువీకరించింది.
భారత పురుషుల, మహిళల జట్లకు ఇక నుంచి ఎంపీఎల్ బ్రాండ్ జెర్సీలు ఉంటాయి. భారత్ ఏ, అండర్ 19 జట్లకు కూడా ఇవే వర్తిస్తాయి. ఈ ఏడాది నవంబరు నుంచి భారత జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కీ కిట్ స్ఫాన్సర్ రూపంలో రూ. 65 లక్షలు ఎంపీఎల్ ఇవ్వనుంది. మొత్తంగా ఈ మూడేళ్ల కలిపి రూ. 120 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. నైక్ సంస్థ ఒక మ్యాచ్‌కు 88 లక్షలు ఇచ్చేది. నైక్ తన అయిదేళ్ల ఒప్పందంలో 2016 నుంచి 2020 వరకు 370 కోట్లు చెల్లించింది.
ఈ స్ఫాన్సర్‌షిప్ కోసం డ్రీమ్ 11, పుమా తదితర కంపెనీలు కూడా ఆసక్తి ప్రదర్శించినట్లు సమాచారం. నిజానికి నైక్‌కి మళ్లీ కిట్ స్ఫాన్సర్‌షిప్ దక్కుతుందని అంతా ఊహించారు. అయితే కరోనా వేళ గత స్ఫాన్సర్‌షిప్‌ని పరిగణలోకి తీసుకుని డిస్కౌంట్ ఇవ్వాలని నైక్ అడగ్గా.. బీసీసీఐ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దాంతో ఎంపీఎల్ ఆ కిట్ స్ఫాన్సర్‌షిప్ ఛాన్స్‌ని దక్కించుకుంది.
ఐపీఎల్ 2020 సీజన్ నవంబరు 10తో ముగుస్తుంది. యూఏఈ నుంచి ఛార్టర్డ్ ప్లైట్‌లో ఆస్ట్రేలియాకి టీమిండియా ఆటగాళ్లు వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నారు. ఈ సిరీస్ నుంచి ఎంపీఎల్ కిట్ స్ఫాన్సర్‌గా వ్యవహరించబోతోంది. ఆటగాళ్లు ఎంపీఎల్ జెర్సీలతో బరిలోకి దిగనున్నారు.