
ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. 40 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60వేలు, అండర్- 23 ప్లేయర్లకు రూ.25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ.20వేలు మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు జై షా తెలిపారు. సోమవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కోల్పోయిన గత సీజన్‌కు గానూ.. దేశవాళీ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50శాతం పరిహారం కింద ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. 2019-20 దేశవాళీ సీజన్‌లో పాల్గొన్న క్రికెటర్లకు 2020-21 సీజన్‌కు గానూ ఈ పరిహారం అందనున్నట్లు చెప్పారు. మహమ్మారి నేపథ్యంలో బీసీసీఐ గతేడాది రంజీ ట్రోఫీని రద్దు చేసిన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీనే కాకుండా ఇంత మేజర్ ట్రోఫీలను కూడా రద్దు చేసింది.
ప్రస్తుతం సీనియర్ దేశీయ క్రికెటర్లు రంజీ లేదా విజయ్ హజారే ట్రోఫీలకు గానూ మ్యాచ్‌కు రూ.35వేల చొప్పున ఫీజు అందుకుంటున్నారు. ఇప్పుడు దానిని రూ.60 వేలకు పెంచారు. ఇక అండర్ 23 క్రికెటర్లకు రూ.25 వేలు, అండర్ 19 క్రికెటర్లకు రూ.20 వేలు మ్యాచ్ ఫీజుగా ఇవ్వనున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే క్రికెటర్లకు రూ.17500 ఇస్తున్నారు. తుది జట్టులో ఆడే ప్లేయర్స్‌కు ఈ మ్యాచ్ ఫీజు ఇస్తుండగా.. రిజర్వ్ ప్లేయర్స్ ఇందులో సగం మొత్తం అందుకుంటారు.
2019-20 సీజన్ ఆడిన క్రికెటర్లకు 2020-21 సీజన్‌లో 50 శాతం అదనంగా చెల్లించనున్నట్లు కూడా జే షా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరు 20 నుంచి ముస్తఖ్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఆ తర్వాత నవంబరు 16, 2021 నుంచి ఫిబ్రవరి 19, 2022 రంజీ ట్రోఫీ, ఫిబ్రవరి 23, 2022 నుంచి మార్చి 26, 2022 వరకు విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. ఇక భారత జాతీయ జట్టులో ఆడే క్రికెటర్లకు కాంట్రాక్టు లెక్కన బీసీసీఐ మ్యాచ్ ఫీజు చెల్లిస్తుంటుంది. అందులో గ్రేడులను బట్టి మ్యాచ్ ఫీజు ఉంటుంది. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ అధిక ఫీజు చెల్లిస్తోంది.