
హైదరాబాద్: అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ గెలుచుకున్న భారత జట్టు క్రికెటర్లకు బీసీసీఐ నగదు బహుమతిని అందజేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ సీకే ఖన్నా వెల్లడించారు. న్యూజిలాండ్‌లోని క్రిస్ట్ చర్చ్ వేదికగా సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత జట్టును, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఆయన అభినందించారు.
యువ ఆటగాళ్లను ద్రవిడ్ సరైన రీతిలో గైడ్ చేశారని కితాబిచ్చారు. అతని వల్లే అండర్ 19 భారత జట్టు ఇంత నైపుణ్యాన్ని పొందిందంటూ కొనియాడారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన క్రికెటర్లకు నగదు బహుమతులను ప్రకటించనున్నామని పేర్కొన్నారు.
భారత జట్టు ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 203 పరుగుల తేడాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడించింది. భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో తలపడనుంది. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న మ్యాచ్ ఫిబ్రవరి 3వ తేదీ జరుగుతుంది.
న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్‌కు భారత జట్టు అడుగు దూరంలో నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్ సెంచరీ(102)తో రాణించాడు. కెప్టెన్ పృథ్వీ షా(41), మన్‌జ్యోత్ కల్రా(47), సుధాకర్ రాయ్(33) పరుగులతో ఫరవాలేదనిపించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.