
కోల్‌కతా: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. కోల్‌కతా వేదికగా ఈ నెల 20న భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. స్టేడియంలోని అన్ని స్టాండ్స్‌లలోకి ప్రేక్షకులను అనుమతించింది. బెంగాల్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ప్రేక్షకుల అనుమతికి బీసీసీఐ పచ్చ జెండా ఊపింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కరోనా కారణంగా టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదట ప్రేక్షకులను అనుమతించలేదు. కానీ ఇటీవల కాలంలో బెంగాల్‌లో కరోనా కేసులు తగ్గడంతో ప్రేక్షకులను రెండు, మూడో టీ20 మ్యాచ్‌కు అనుమతించాలని కోరుతూ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ అవిషేక్ దాల్మియా బీసీసీఐకి లేఖ రాశాడు. దీనిపై స్పందించిన బీసీసీఐ చర్చించి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మూడో టీ20 మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు తెలియచేస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాకు ఈ మెయిల్ సందేశం పంపారు.
కాగా భారత్, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా టీ20 సిరీస్‌లోనూ అదే ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది. వెస్టిండీస్ మాత్రం టీ20 సిరీస్ గెలుచుకుని వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్( వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్/శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్/ సిరాజ్, యజువేంద్ర చాహల్.
వెస్టీండీస్:
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికొలస్ పూరన్, పావెల్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), హోల్డర్, ఆలెన్, షెఫర్డ్, ఒడీన్ స్మిత్, హొసేన్, కాట్రెల్/డ్రేక్స్.