ముంబై: ఐసీసీ పదవి నుంచి శ్రీనివాసన్‌ను తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన 85వ బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ నిర్ణయం తీసుకున్నారు. శశాంక్ మనోహర్ రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడయ్యాక జరుగుతున్న తొలి ఏజీఎం ఇది.
బోర్డులో తన ఆధిపత్యాన్ని కోల్పోయిన శ్రీనివాసన్ ఐసీసీ ఛైర్మన్‌గా మాత్రం కొనసాగుతున్నాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడే ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగాలి. బీసీసీఐ అధ్యక్ష పదవిని కోల్పోయిన కొన్ని కారణాల వల్ల శ్రీని ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే సోమవారం జరుగుతున్న ఏజీఎంలో ఐసీసీ అధ్యక్షుడిగా మనోహార్‌ను నియమిస్తూ బోర్డు ఐసీసీకి ప్రతిపాదించడంతో బీసీసీఐలో శ్రీనివాసన్ శకం పూర్తిగా ముగిసిపోయింది. దీంతో పాటు విరుద్ధ ప్రయోజనాల విషయంలో బోర్డు కఠిననంగా వ్యవహరించడం లేదని వస్తున్న అభిప్రాయలపై కూడా దృష్టి సారించారు.
దీనికి సంబంధించి బీసీసీఐలో అంబుడ్స్‌మన్ నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జాతీయ, అంతర్జాతీయ మాజీ క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆడిన కాలం, మ్యాచ్‌ల సంఖ్య, ఫార్మెట్‌ను బట్టి వివిధ మొత్తాలను అందుకోనున్నారు.
నెలవారీ, ఏకమొత్తంలో వాటిని అందించాలని బోర్డు నిర్ణయించింది. దీని ప్రకారం 2003-04కు ముందు వందకుపైగా టెస్టులు ఆడిన క్రికెటర్లు ఏకకాల చెల్లింపు కింద రూ. 1.5 కోట్లు దక్కించుకోనున్నారు.
రూ. 1.5 కోట్లు అందుకోనున్న వారిలో గవాస్కర్, రవిశాస్త్రి, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ సహా 11 మంది మాజీలు ఉన్నారు. 75 నుంచి 99 టెస్టులు ఆడిన వారికి రూ. కోటి, 50 నుంచి 74 టెస్టుల్లో భారతకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లకు రూ. 75 లక్షలు అందించనుంది.
ఇక జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం అంపైర్లు, కోచ్‌లు, రిఫరీలు, సిబ్బందికి చెల్లించే మ్యాచ్ ఫీజులను సైతం బోర్డు గణనీయంగా పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ తన వెబ్ సైట్‌లో ఉంచింది.